వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య స్థితిగతులపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన బహిరంగ ప్రదేశాల్లో తడబడుతూ నడవడం, కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడటం వంటి వీడియోలు పెద్ద చర్చకు దారితీశాయి. అంతేకాకుండా, ఆయన చీలమండలు (ankles) వాపుతో ఉన్నాయని, చర్మం రంగు కూడా మారిందని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలను షేర్ చేస్తున్నారు.
సాధారణంగా అమెరికాలో అధ్యక్షుడి ఆరోగ్యంపై ప్రజలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. దేశాన్ని పాలించే వ్యక్తి, కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తి శారీరకంగా ధృడంగా ఉండాలని అమెరికన్లు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో 80 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వైరల్ వీడియోలు: ముఖ్యంగా ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం మెట్లు దిగుతున్నప్పుడు ట్రంప్ పడిన ఇబ్బందిపై చర్చ జరుగుతోంది. మార్చి 21న ఆయన ఫ్లోరిడా చేరుకున్నప్పుడు తీసిన ఈ వీడియోలో, ట్రంప్ విమానం రెయిలింగ్‌ను గట్టిగా పట్టుకుని చాలా జాగ్రత్తగా మెట్లు దిగడం కనిపిస్తుంది. మధ్యలో ఒక క్షణం ఆగి నిలదొక్కుకుని మరీ అడుగులు వేశారు. అమెరికాలో అధ్యక్షుడి నడకను ఆయన ఆరోగ్యానికి కొలమానంగా చూస్తారు కాబట్టి, ఈ వీడియో వైరల్ అయ్యింది.
కూర్చోవడానికి కూడా కష్టమే: కేవలం నడక మాత్రమే కాదు, మార్చి 20న ఇరాన్ యుద్ధంపై సమీక్షల మధ్య ఆయన గోల్ఫ్ ఆడటానికి వెళ్లినప్పుడు కూడా ఆయన రూపం మామూలుగా లేదని వార్తలు వచ్చాయి. అంతకుముందు రోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఆయన కుర్చీలో కూర్చోవడానికి టేబుల్‌ను రెండు చేతులతో పట్టుకుని చాలా కష్టపడ్డారు. మోకాళ్లను వంచడానికి ఆయన పడుతున్న ఇబ్బంది స్పష్టంగా కనిపించింది. ఈ వరుస ఘటనలు ఆయన ఆరోగ్యంపై అనుమానాలను పెంచాయి.
ట్రంప్ స్పందన: అయితే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. “నా ఆరోగ్యం 100% అద్భుతంగా ఉంది. గతంలో వైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ నన్ను అత్యంత ఆరోగ్యవంతుడైన అధ్యక్షుడిగా అభివర్ణించారు, ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు” అని ఆయన వ్యాఖ్యానించారు.
నెటిజన్ల విమర్శలు: ట్రంప్ ఆరోగ్యంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన సమయం వచ్చింది” అని కొందరు అంటుండగా, మరికొందరు “ఆయనకు వయస్సు పైబడింది, మెదడు కూడా చురుగ్గా పనిచేయడం లేదు, అందుకే యుద్ధం వంటి విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు” అని విమర్శిస్తున్నారు.
