తిరునెల్వేలి (నెల్లై): కన్నకూతురిపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన కసాయి తండ్రికి తిరునెల్వేలి పోక్సో (POCSO) కోర్టు ఈరోజు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో కేవలం 7 నెలల స్వల్ప కాలంలోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించడం గమనార్హం.
కేసు వివరాలు: తిరునెల్వేలి జిల్లా నాంగునేరి ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల కార్మికుడికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. రక్షించాల్సిన తండ్రే ఆ బాలికపై వరుసగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీని ఫలితంగా ఆ బాలిక 7 నెలల గర్భవతి అయింది. ఈ షాకింగ్ విషయం బయటపడటంతో, గత 7 నెలల క్రితం నాంగునేరి మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
వేగవంతమైన దర్యాప్తు: అప్పటి నాంగునేరి అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్న కుమార్ నేతృత్వంలోని బృందం ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టింది. జిల్లా ఎస్పీ సిలంబరసన్ మార్గదర్శకత్వంలో పోలీసులు అతి తక్కువ కాలంలోనే నిందితుడికి వ్యతిరేకంగా పక్కా ఆధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు.
కోర్టు తీర్పు: తిరునెల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి సురేష్ కుమార్ సమక్షంలో ఈ విచారణ జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాది ఉష బాధితురాలి తరపున బలమైన వాదనలు వినిపించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. “రక్షణ కల్పించాల్సిన తండ్రే ఇటువంటి దారుణానికి ఒడిగట్టడం సమాజం క్షమించరాని నేరం” అని పేర్కొన్నారు.
