కన్నతల్లే ఇలా చేస్తే ఆ పసిపాప ఎవరి దగ్గరికి వెళ్తుంది..? ఆరేళ్లే నిండాయి.. కర్రతో కొట్టి, కరెంట్ షాక్ ఇచ్చి.. చిన్నారిని ఏడ్పించి ఏడ్పించి చితకబాదిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో..!

గుజరాత్ రాష్ట్రం జునాగఢ్‌లో 6 ఏళ్ల చిన్నారిపై ఆమె కన్నతల్లే అత్యంత అమానుషంగా దాడి చేసిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ బాలికను కర్రతో కొట్టి, కరెంట్ వైర్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. చిన్నారి పెట్టిన ఆర్తనాదాలు, కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు.

చిన్నారిని విచక్షణారహితంగా కొడుతుండటాన్ని గమనించిన స్థానికులు జోక్యం చేసుకుని, ఆమెను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు, చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, శిశు సంక్షేమ రక్షణ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

అధికారులు జరిపిన విచారణలో, తన తల్లి తనపై నిరంతరం దాడి చేసేదని ఆ చిన్నారి చెప్పినట్లు సమాచారం. పోలీసుల విచారణలో తల్లి కూడా చిన్నారిని కొట్టినట్లు అంగీకరించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ బాలికను శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉంచి, తగిన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నారు.

ఈ ఘటనపై శిశు సంరక్షణ విభాగం అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జునాగఢ్ పోలీసులు ఆ తల్లిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారి రక్షణ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు.


Posted

in

by

Tags: