అమెరికాలో కన్నతండ్రే తన 11 నెలల పసికందును సజీవంగా పూడ్చిపెట్టిన దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి పనికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, 25 ఏళ్ల మైఖేల్ అనే వ్యక్తి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. కన్న బిడ్డనే సజీవంగా పూడ్చిపెట్టిన ఆ వ్యక్తి రాక్షసత్వం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
చిన్నారిని చూసుకోవడానికి వచ్చిన కేర్‌టేకర్ (సంరక్షకురాలు) ఇంటికి రాగానే, తండ్రి, బిడ్డ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఇద్దరి కోసం వెతకడం ప్రారంభించింది. ముమ్మరంగా గాలించగా, చిన్నారి తాతయ్య ఇంటి పక్కన ఉన్న స్థలంలో, ఓ టవల్లో చుట్టి మట్టిలో సజీవంగా పూడ్చిపెట్టిన పసికందును గుర్తించారు. వెంటనే అప్రమత్తమై చిన్నారిని బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఆ 11 నెలల పసికందును.. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి వైద్యుల ముమ్మర పర్యవేక్షణలో ఉంది. కన్న బిడ్డనే అత్యంత దారుణంగా పూడ్చిపెట్టేందుకు తెగించిన తండ్రి మైఖేల్‌ను అమెరికా పోలీసులు హుటాహుటిన అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Leave a Reply