‘కన్యాదానం’ చేస్తానన్నాడు.. కామంతో కాటేశాడు! భోందూబాబా అశోక్ ఖరాత్ వికృత రూపం.. పెళ్లికి ముందు నవవధువుపై అఘాయిత్యం!

క్రైమ్ డెస్క్: నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, భక్తి ముసుగులో అరాచకాలు సాగిస్తున్న ‘క్యాప్టెన్ బాబా’ అలియాస్ అశోక్ ఖరాత్ పాపపు చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఎంతోమంది పారిశ్రామికవేత్తలను నమ్మించి ముంచేయడమే కాకుండా, పదుల సంఖ్యలో మహిళలను లైంగికంగా వేధించిన ఈ భోందూబాబా గురించి తాజాగా మరో భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. ఏ పాదధూళిని అయితే భక్తులు నెత్తిన పెట్టుకున్నారో, అదే వ్యక్తి ఆడబిడ్డల జీవితాలతో ఎంత నీచంగా ఆడుకున్నాడో తెలిసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

‘నువ్వే నా ఇష్టమైన కూతురివి’ అంటూ వల: బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. ఈ దారుణాల వెనుక ఉన్న అసలు కథ ఇది. “2019లో నేను మొదటిసారి అశోక్ ఖరాత్‌ను కలిశాను. అప్పుడు అతను నా తల మీద చేయి పెట్టి, ‘నువ్వు నాకు అత్యంత ఇష్టమైన కూతురివి.. నీ కన్యాదానం నేనే స్వయంగా చేస్తాను’ అని నమ్మబలికాడు. ఆ మాటలతో అతడిని దైవంతో సమానంగా భావించి మా కుటుంబం మొత్తం అతడికి దగ్గరయ్యాం” అని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.

పెళ్లికి ముందు పూజ పేరుతో పాడుపని: 2022లో బాధితురాలికి పెళ్లి నిశ్చయమైంది. ఆశీర్వాదం తీసుకోవడానికి తన కాబోయే భర్తతో కలిసి ఆమె ఆశ్రమానికి వెళ్లింది. అప్పుడు ఆ కేటుగాడు తన అసలు ప్లాన్ అమలు చేశాడు. “పెళ్లికి ముందు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే ఈశాన్యేశ్వర మహాదేవాలయంలో ‘సిద్ధ పూజ’ చేయాలి.. దాని కోసం నువ్వు ఒక్క రోజు రావాలి” అని నమ్మించాడు.

పూజా విధానం గురించి చెబుతానంటూ ఆమెను ఆశ్రమ ఆఫీసు గదిలోకి పిలిచాడు. లోపలికి వెళ్లగానే తలుపులు గడియపెట్టి.. “ఏం భయపడకు, నీకు పుష్కరాజాన్ని ఇస్తున్నాను.. అంతా మంచే జరుగుతుంది” అంటూ ప్రసాదం ఇచ్చాడు. అది తిన్న కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ స్థితిలోనే ఆమెపై మొదటిసారి అత్యాచారం చేశాడు.

మూడేళ్ల పాటు మత్తు ఇచ్చి నరకం: అక్కడితో ఆ ఉన్మాది ఆగలేదు. నవంబర్ 2022 నుండి డిసెంబర్ 2025 వరకు.. అంటే దాదాపు మూడేళ్ల పాటు ఆమెకు మత్తు పదార్థాలు ఇస్తూ నిరంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. పరువు పోతుందనే భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న బాధితురాలు, బాబా అసలు రంగు బయటపడటంతో ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రస్తుతం పోలీసులు ఈ కామాంధుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాబా ముసుగులో ఇంకా ఎంతమంది జీవితాలను చిదిమేశాడో అన్న కోణంలో విచారణ సాగుతోంది.


Posted

in

by

Tags: