తమిళ సినిమాల్లో 1990లలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటి సుకన్య. దర్శకుడు భారతీరాజా రూపొందించిన ‘పుదు నెల్లు పుదు నాత్తు’ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత చిన్న గౌండర్ (తెలుగులో చంటి), తిరుమతి పళనిసామి, ఇండియన్ (భారతీయుడు), మహానది, చిన్న మాప్లే వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు.
ఏ పాత్రనైనా తనదైన నటనతో మెప్పించడం సుకన్య ప్రత్యేకత. ముఖ్యంగా ‘ఇండియన్’ సినిమాలో కమల్ హాసన్ సరసన ‘అమృతవల్లి’ పాత్రలో ఆమె నటన ఎంతో హుందాగా ఉంటుంది. ఇండియన్ తాత కమల్ లాగే, సుకన్య కూడా ఆ సినిమాలో వృద్ధురాలి గెటప్‌లో అద్భుతమైన నటనను కనబరిచారు.
సుకన్య ఒక గొప్ప భరతనాట్య కళాకారిణి అనే విషయం చాలామందికి తెలియదు. ఆమె చెన్నైలో పలు వేదికలపై నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. 2002లో ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న సుకన్య, ఏడాదికే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచి పాత్రలను ఎంచుకుని నటించారు. కొన్ని టీవీ సీరియల్స్‌లో కూడా ఆమె మెరిశారు. తరచూ తిరువణ్ణామలై, మధురై వంటి ఆలయాలను సందర్శిస్తూ దైవచింతనలో గడుపుతున్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకన్య ఇలా అన్నారు: “‘మహానది’ సినిమా కంటే ముందు చిత్ర పరిశ్రమ తరపున ఒక డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది. దాని కోసం నేను కమల్ హాసన్‌తో కలిసి సింగపూర్ వెళ్లాల్సింది. కానీ అప్పట్లో వెళ్లలేకపోయాను. ఆ ప్రోగ్రాం కోసం మూడు రిహార్సల్స్ ఉండాలని చెప్పారు. అప్పుడు నేను పొల్లాచ్చి, గోపిశెట్టిపాళయంలో షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల రిహార్సల్స్‌కు వెళ్లలేకపోయాను. ఆ అవకాశం కోల్పోయినప్పుడు ఇక కమల్‌తో కలిసి పని చేసే అవకాశం రాదేమో అని భయపడ్డాను. కానీ అదృష్టవశాత్తూ ఆ తర్వాత మహానది, ఇండియన్ వంటి రెండు గొప్ప చిత్రాల్లో ఆయనతో కలిసి నటించాను” అని సుకన్య పేర్కొన్నారు.
