భార్యాభర్తల బంధంలో నమ్మకమే పునాది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో కర్వా చౌత్ రోజున చోటుచేసుకున్న ఓ ఘటన కలకలం రేపింది. భర్త ఆయురారోగ్యాల కోసం భార్యలు ఉపవాసం ఉండే రోజే.. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి హోటల్ గదిలో ఉండగా భర్తకు పట్టుబడినట్లు సమాచారం.
బదాయూన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనలో మార్పు కనిపించిందని, ఆమె తరచూ మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందని భర్త అనుమానించినట్లు కథనం పేర్కొంది. ఈ విషయంపై ప్రశ్నించగా ఆమె నిరాకరించిందని తెలుస్తోంది. గత రెండు నెలలుగా భార్య పుట్టింట్లోనే ఉంటూ భర్త ఇంటికి రావడం లేదని సమాచారం.
ఈ క్రమంలో కర్వా చౌత్ రోజున బరేలీ జంక్షన్ సమీపంలో భార్య మరో వ్యక్తితో కలిసి వెళ్తుండటాన్ని భర్త గమనించాడు. అనుమానంతో వారిని వెంబడించగా, ఇద్దరూ ఓ హోటల్‌కు వెళ్లి గది తీసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు హోటల్‌కు చేరుకుని గది తలుపు తెరవగా, ఆ మహిళ మరో వ్యక్తితో కలిసి ఉన్నట్లు తెలిసింది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
విచారణ సమయంలో భర్తతో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని, తాను ప్రియుడితోనే వెళ్తానని ఆ మహిళ స్పష్టం చేసినట్లు కథనం పేర్కొంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
