ప్రపంచంలో ఎంతోమంది యువకులు సౌకర్యవంతమైన జీవితంలో చదువుకుంటూ తమ భవిష్యత్తును నిర్మించుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తమ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఫిలిప్పీన్స్‌కు చెందిన అరిస్టన్ ఎరా అనే యువకుడు ఒకరు.
యూనివర్సిటీలో మెరైన్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న అరిస్టన్.. పగటిపూట కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. చదువు పూర్తయ్యాక రాత్రివేళ వీధుల్లో వేరుశెనగలు అమ్ముతూ తన ఖర్చులను తానే సంపాదించుకుంటున్నాడు. అంతేకాదు.. కుటుంబానికి కూడా ఆర్థికంగా అండగా నిలుస్తున్నాడు.
పగటిపూట సముద్రాలు, నౌకలు, మెరైన్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన పాఠాలు నేర్చుకుంటూ.. రాత్రిపూట చిన్న బండిపై వేరుశెనగలు పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ విక్రయించడం అతడి దినచర్యగా మారిపోయింది.
అరిస్టన్కు చిన్నప్పటి నుంచే కష్టపడి పనిచేయడం అలవాటు. తన 11వ ఏట నుంచే తల్లితో కలిసి మార్కెట్లలో సంప్రదాయ ఆహార పదార్థాలను విక్రయించేవాడు. ఆ తర్వాత చిన్న చిన్న వస్తువులు, గుడ్లు, పండ్లు అమ్ముతూ కుటుంబానికి సహాయం చేసేవాడు. ఇప్పుడు ఉన్నత విద్య అభ్యసిస్తున్నప్పటికీ తన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు.
తెల్లవారుజామున 3 గంటల వరకు వ్యాపారం.. ఉదయం 7:30కే కాలేజీ!
అరిస్టన్ రోజువారీ జీవితం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు వేరుశెనగలు విక్రయిస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపు మాత్రమే నిద్రపోయి, ఉదయాన్నే లేచి తన కాలేజీ యూనిఫామ్‌ను ఇస్త్రీ చేసుకుని సిద్ధమవుతాడు. ఉదయం 7:30 గంటలకల్లా కాలేజీకి చేరుకుంటాడు.
ఐదుగురు సోదరుల్లో పెద్దవాడైన అరిస్టన్కు తన చదువు ఖర్చులను భరించడమే కాకుండా, తన తమ్ముళ్ల భవిష్యత్తుకు కూడా అండగా నిలవాలనే లక్ష్యం ఉంది. అందుకే అలసటను లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్నాడు.
“నిజాయితీగా పనిచేసి సంపాదించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇతరుల ముందు చేయి చాచడం కంటే మన కాళ్లపై మనం నిలబడటమే గొప్ప విషయం” అని అరిస్టన్ చెప్పే మాటలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి.
కేవలం వేరుశెనగల వ్యాపారంతోనే ఆగిపోకుండా భవిష్యత్తులో సొంతంగా స్థానిక డెలివరీ సేవలను ప్రారంభించాలని అతడు కలలు కంటున్నాడు. అంతేకాదు.. ఆకలితో అలమటించే జంతువుల కోసం ఓ ఆశ్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా అతడి మరో ఆశయం.
ప్రస్తుతం అరిస్టన్ కష్టపడి చదువుకుంటూ, నిజాయితీగా సంపాదిస్తున్న తీరు సోషల్ మీడియాలో పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
పరిస్థితులు ఎలా ఉన్నా.. కష్టపడటానికి వెనుకాడకుండా, ఆత్మగౌరవంతో జీవించాలనుకునే ప్రతి ఒక్కరికీ అరిస్టన్ జీవితం ఓ గొప్ప పాఠం. పని చిన్నదా, పెద్దదా అన్నది కాదు.. మనం సంపాదించే విధానం నిజాయితీగా ఉందా లేదా అన్నదే ముఖ్యం!

Leave a Reply