కాండమ్స్ కోసం లక్ష రూపాయల ఖర్చు.. 127 ఆర్డర్లలో ఒక కాండమ్ ప్యాక్! స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్.

భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ క్రమంగా పెరుగుతోంది. తాజాగా స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ‘ఇన్‌స్టామార్ట్’ తన 2025 వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారతీయుల వింత షాపింగ్ అలవాట్లకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కాండమ్స్ కోసం భారీ ఖర్చు: చెన్నైకి చెందిన ఒక కస్టమర్ ఏడాది పొడవునా కేవలం కాండమ్స్ కొనుగోలు కోసమే ఏకంగా 1 లక్ష రూపాయలు ఖర్చు చేశారు. సగటున ప్రతి 127 ఆన్‌లైన్ ఆర్డర్లలో ఒక కాండమ్ ఆర్డర్ ఉంటుందని ఈ నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2025లో ఈ అమ్మకాలు 400% పెరగడం విశేషం. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో అత్యధికంగా ఆర్డర్లు నమోదయ్యాయి.

నగరాల వారీగా వింత రికార్డులు:

  • ముంబై: ఇక్కడి ఒక కస్టమర్ ‘రెడ్ బుల్ షుగర్ ఫ్రీ’ ఎనర్జీ డ్రింక్ కోసం ఏడాదిలో 16.3 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
  • హైదరాబాద్: మన భాగ్యనగరానికి చెందిన ఒక వ్యక్తి కేవలం గులాబీ పూల కోసం 31,240 రూపాయలు ఖర్చు చేయగా, మరొక ఐఫోన్ ప్రేమికుడు ఒకేసారి మూడు ఐఫోన్ 17లను 4.3 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు.
  • నోయిడా: ఒక జిమ్ ప్రేమికుడు ప్రొటీన్ ఉత్పత్తుల కోసం 2.8 లక్షల రూపాయలు ఖర్చు చేయగా, మరొక కస్టమర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల (స్పీకర్లు, వాక్యూమ్ క్లీనర్లు) కోసం 2.69 లక్షలు వెచ్చించారు.
  • బెంగళూరు: ఇక్కడి ఒక ఉదారవాది ‘ధన్తేరస్’ పండుగ సందర్భంగా డెలివరీ బాయ్స్ కి ఏకంగా 68,600 రూపాయలు టిప్స్ (Tips) రూపంలో ఇచ్చి రికార్డు సృష్టించారు.

వంటగది అవసరాలకు కూడా ఆన్‌లైన్: కరివేపాకు, పెరుగు, గుడ్లు, పాలు వంటి చిన్నపాటి వస్తువుల కోసం కూడా ప్రజలు ఆన్‌లైన్ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. కొచ్చికి చెందిన ఒక కస్టమర్ ఏడాదిలో ఏకంగా 368 సార్లు కరివేపాకు ఆర్డర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


Posted

in

by

Tags: