దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో, మద్యం మత్తులో తన 67 ఏళ్ల వృద్ధ తల్లిని హింసించి, రాత్రంతా లైంగిక దాడికి పాల్పడిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బురారీ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల నిందితుడు, గత ఏప్రిల్ 17వ తేదీన ఇంట్లో జరిగిన గొడవలో తన 16 ఏళ్ల కుమార్తెను కొట్టి హింసించాడు. దీనితో భయపడిన ఆ బాలిక, అదే ప్రాంతంలో ఉంటున్న తన అత్తగారి ఇంటికి వెళ్లి ఆశ్రయం పొందింది.
ఆ తర్వాత, రాత్రి సమయంలో నిందితుడు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న అతని 67 ఏళ్ల తల్లి తన కుమారుడికి భోజనం పెట్టడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆ కామపిశాచి, తన తల్లి కాళ్లు చేతులు కట్టేసి రాత్రంతా పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొడుకు గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత, ఆ తల్లి ధైర్యంగా తన కట్లను విప్పుకుని ఇంటి నుండి తప్పించుకుంది. వెంటనే తన మనవరాలికి ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని వివరించింది. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలైన వృద్ధురాలికి, ఆమె మనవరాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు.
ఇలాంటిదే మరో దిగ్భ్రాంతికర ఘటన గతేడాది ఢిల్లీలోని హౌస్ ఖాజీ ప్రాంతంలో జరిగింది. అక్కడ 39 ఏళ్ల వ్యక్తి తన 66 ఏళ్ల తల్లిపై రెండుసార్లు అత్యాచారం చేసినందుకు అరెస్టయ్యాడు. తన తండ్రి నుండి విడాకులు తీసుకోవాలని, తల్లి గత ప్రవర్తనను శిక్షిస్తున్నానని చెబుతూ ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తెలిసింది. కన్నతల్లికి కూడా రక్షణ లేని ఇటువంటి పరిస్థితులు ఢిల్లీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
