పంజాబ్ రాష్ట్రం లూథియానా జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్, శిరోమణి అకాలీదళ్ (SAD) పార్టీ నేత నవతేజ్ సింగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
మనేవాల్ గ్రామానికి మాజీ సర్పంచ్ అయిన ఆయన శనివారం సాయంత్రం తన టయోటా ఇన్నోవా కారులో ఒంటరిగా వెళ్తున్నారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై ముఖాలకు ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన కారును అడ్డగించి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ దాడిలో సుమారు 10 నుంచి 15 రౌండ్ల కాల్పులు జరగ్గా, అందులో 10 నుంచి 13 బుల్లెట్లు నవతేజ్ సింగ్ శరీరంలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారని కొందరు, ఆసుపత్రికి తరలించిన తర్వాత ప్రాణాలు విడిచారని మరికొందరు చెబుతున్నారు. ఈ దారుణ ఘటన ఆయన కారులో అమర్చిన డాష్‌క్యామ్‌లో రికార్డ్ అయినట్లు సమాచారం. ఆ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు.
కుటుంబ సభ్యుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న భూవివాదం కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని నవతేజ్ సింగ్ కుమారుడు, న్యాయవాది అయిన అలమ్జిత్ సింగ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మామ బాల్ సింగ్‌తో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని గుర్తించగా, మిగిలిన ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. భూమికి సంబంధించి నవతేజ్ సింగ్‌కు, మరో వర్గానికి మధ్య అప్పటికే వివాదాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
శిరోమణి అకాలీదళ్-బీజేపీ (SAD-BJP) సంకీర్ణ ప్రభుత్వ హయాంలో నవతేజ్ సింగ్ మనేవాల్ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత వేర్వేరు సమయాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ (AAP) పార్టీలకు రాజకీయ మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఆయన రాజకీయ నేపథ్యం, వ్యక్తిగత గొడవలు, భూవివాదం తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపినట్లుగా భావిస్తున్న ఆ ఇద్దరు గుర్తుతెలియని దుండగులను ఇంకా అరెస్టు చేయలేదు. వారిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply