మధ్యప్రదేశ్ రాష్ట్రం, ధార్ జిల్లాలోని కుక్షి పట్టణంలోని సుతార్ మొహల్లా ప్రాంతంలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో తండ్రీకొడుకులు కారు బోనెట్‌పై పడిపోగా, వారిని అలాగే దాదాపు 4 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లినట్లు సమాచారం అందింది.
అక్టోబర్ 21వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, కారును ఆపేందుకు స్థానికులు వాహనాన్ని వెంటపడి తరిమారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సిర్వి మొహల్లా ప్రాంతానికి చెందిన బాబూలాల్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి దాదాపు 8 గంటల సమయంలో ఆయన తన పొలానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో వార్డు నంబర్ 2లోని సుతార్ మొహల్లా ప్రధాన రహదారిపై వచ్చిన కారు ఆయనను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బాబూలాల్ ప్రాణాలతో బయటపడగా, కారును జాగ్రత్తగా నడపాలని డ్రైవర్‌కు సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన డ్రైవర్, కారు దిగి బాబూలాల్పై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదే సమయంలో అక్కడికి చేరుకున్న బాబూలాల్ కుమారుడు భరత్, జరుగుతున్న ఘటనను తన మొబైల్లో ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో మరింత ఆగ్రహించిన డ్రైవర్, కారును ఒక్కసారిగా వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆ క్రమంలో తండ్రీకొడుకులిద్దరూ కారు ముందు భాగంలోని బోనెట్‌పై పడిపోయారు. అయినా డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. ఇద్దరూ భయంతో కేకలు వేస్తూ కారు ఆపమని వేడుకున్నా డ్రైవర్ పట్టించుకోలేదు. అలా వారిని సుమారు 4 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ క్రమంలో బాధితుల ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర, జైదీప్ కుంజాల్ తదితరులు కారును వెంబడించి, లోని ఫాటా సమీపంలో అడ్డుకున్నారు. ఈ ఘటనలో బాబూలాల్ కుడి చేతి వేళ్లు, అరచేయి, కుడి మోకాలు, పక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన కుమారుడు భరత్ కుడి మణికట్టు, బొటనవేలు, ఎడమ మోకాలికి కూడా గాయాలయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply