బెంగళూరులోని ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే దంపతులు, తమ నివాసాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి మార్చుకుని, అక్కడి నుండే ‘రిమోట్ వర్క్’ (Work from home) చేయడం ప్రారంభించారు.
అలా మారిన తర్వాత, ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేకుండానే తమకు నెలకు ₹30,000 వరకు డబ్బు ఆదా అవుతోందని వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. బెంగళూరులో ₹45,000 ఉన్న ఇంటి అద్దె, మనాలిలో ₹28,000కి తగ్గడంతో, కేవలం అద్దె రూపంలోనే వారికి ₹17,000 ఆదా అయ్యింది.
అంతేకాకుండా, ఆఫీసుకి ప్రయాణించే ఖర్చు ₹3,000, కాఫీ మరియు స్నాక్స్ ఖర్చులు ₹2,500, ఆఫీసు సంబంధిత డిన్నర్లు లేకపోవడంతో ₹5,000.. ఇలా వివిధ మార్గాల్లో వారి డబ్బు ఆదా అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే, ముఖ్యంగా బెంగళూరు వంటి మహానగరాల్లో పని ఒత్తిడి నుండి బయటపడటానికి వారాంతాల్లో (Weekends) చేసే అనవసరపు ఖర్చులు ₹5,000 నుండి ₹6,000 వరకు మనాలిలో పూర్తిగా తగ్గిపోయాయి.
తాము డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో మనాలికి వెళ్లలేదని, తమ జీవనశైలిని మార్చుకోవడానికి మాత్రమే వెళ్లామని, ఈ పొదుపు తమకు అదనపు బోనస్‌గా లభించిందని అంజలి అనే ఆ దంపతుల్లోని భార్య పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే కంపెనీలు మరియు మనాలిలో ఉన్న హోమ్‌స్టే సౌకర్యాల గురించి నెటిజన్లు ఆసక్తిగా అడుగుతున్నారు.
