“కాలింగరాయన్ వారసుడే నటుడు సత్యరాజ్” – ఈరోడ్ సభలో విజయ్ చెప్పిన ఆసక్తికర కథ!

తమిళనాడు ఈరోడ్ జిల్లా విజయమంగళంలో జరిగిన టీవీకే (TVK) బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు విజయ్ తన ప్రసంగంలో చారిత్రక పురుషుడు ‘కాలింగరాయన్’ గురించి గొప్పగా మాట్లాడారు. ఈరోడ్ జిల్లా వ్యవసాయ అభివృద్ధికి పునాది వేసిన కాలింగరాయన్ ఆనకట్ట మరియు కాలువ విశిష్టతను ఆయన కొనియాడారు.

విజయ్ చెప్పిన ‘కుట్టి స్టోరీ’:
విజయ్ తన ప్రసంగంలో ఇలా అన్నారు: “ఈరోడ్ ప్రజల వ్యవసాయానికి కవచంలా నిలిచేవి కాలింగరాయన్ ఆనకట్ట మరియు కాలువ. ఈ కాలువ తవ్వే సమయంలో కాలింగరాయన్ అలసిపోయి నిరుత్సాహపడగా.. ఆయన తల్లి తాను పెరుగు, మజ్జిగ అమ్మి దాచుకున్న డబ్బును ఇచ్చి, ‘దీనిని తీసుకుని వెళ్లి కాలువ తవ్వకం పూర్తి చేయి’ అని ప్రోత్సహించిందట. నాటి కాలింగరాయన్‌కు ప్రజలపై ఉన్న శ్రద్ధ నేటి పాలకుల్లో లేదు.”

కాలింగరాయన్ కాలువ – త్యాగానికి చిహ్నం:
పాండ్య సామ్రాజ్యంలో సేనాపతిగా, చిన్న రాజ్యానికి రాజుగా ఉన్న కాలింగరాయన్ 1271వ సంవత్సరంలో ఈ కాలువ నిర్మాణాన్ని ప్రారంభించి, 1283లో పూర్తి చేశారు. అయితే, ఆ కాలువను తన సొంత భూముల ప్రయోజనం కోసమే నిర్మించారని కొందరు విమర్శించగా.. కాలింగరాయన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. “ఈ కాలువ నీటిని నేను గానీ, నా కుటుంబం గానీ, నా వారసులు గానీ ఎప్పటికీ ఉపయోగించము” అని శపథం చేసి, ఈరోడ్ వదిలి కోయంబత్తూర్ సమీపంలోని ఊత్తుకుళి ప్రాంతానికి వలస వెళ్లిపోయారు. నేటికీ ఆయన వారసులు ఆ నీటిని ముట్టుకోరు.

నటుడు సత్యరాజ్ – 36వ తరం వారసుడు:
విశేషం ఏమిటంటే, విజయ్ సినిమాల్లో విలన్‌గా, తండ్రిగా నటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్ కాలింగరాయన్ వారసుడే. సత్యరాజ్ తల్లి నాథాంబాల్, కాలింగరాయన్ మహారాజు యొక్క 36వ తరం వారసురాలని చెబుతారు. సత్యరాజ్ ఈ విషయాన్ని ఎప్పుడూ పెద్దగా ప్రచారం చేసుకోలేదు.

సత్యరాజ్ ఎందుకు రహస్యంగా ఉంచారు?
ఒక ఇంటర్వ్యూలో సత్యరాజ్ దీనిపై స్పందిస్తూ.. తాను సినిమా అవకాశాల కోసం చెన్నై వచ్చినప్పుడు, నటుడు శివకుమార్ ద్వారా నిర్మాత చిన్నప్ప దేవర్కు పరిచయం అయ్యారు. అప్పుడు తన కుటుంబం ఒక రాజు వంశమని తెలియగానే, “రాజ కుటుంబం నుండి వచ్చి సినిమాల్లో నటిస్తావా?” అని దేవర్ గారు మొదట అవకాశం ఇవ్వడానికి నిరాకరించారట. ఆ కారణం చేతనే తాను రాజుల వంశస్థుడినని చెప్పుకోవడానికి ఇష్టపడలేదని సత్యరాజ్ పేర్కొన్నారు.


Posted

in

by

Tags: