డైరీ ఫ్రీ ఫుడ్స్ (పాల ఉత్పత్తులు లేని కాల్షియం ఆహారాలు): దృఢమైన ఎముకలు మరియు దంతాల కోసం కాల్షియం చాలా అవసరం. కాల్షియం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పాలు. పుట్టినప్పటి నుండి పిల్లలకు పాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తారు.
అయితే, మన భారతీయ ఆహార పద్ధతుల్లో పాలు కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఎన్నో ఇతర పదార్థాలు ఉన్నాయి. లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ (పాలు పడని వారు) ఉన్నవారికి లేదా డైరీ ఉత్పత్తులు తీసుకోని వారికి ఇవి చాలా మేలు చేస్తాయి. కేవలం కాల్షియం తీసుకోవడమే కాకుండా, శరీరం దానిని గ్రహించేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.
కాల్షియం అధికంగా ఉండే 7 ఆహార పదార్థాలు:
- నువ్వులు: ఇవి కాల్షియంకు సహజ వనరులు. 100 గ్రాముల నువ్వుల్లో సుమారు 975-976 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ కూడా లభిస్తాయి. నువ్వుల లడ్డూలు, చట్నీ లేదా పిండిలో కలుపుకుని రొట్టెలుగా చేసుకుని తినవచ్చు.
- కరివేపాకు: ఇది కేవలం రుచికే కాకుండా, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ మరియు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. దీనిని పప్పులు, కూరలు, చట్నీ లేదా సూప్‌లలో ఉపయోగించవచ్చు.
- రాగి: దీనిని కాల్షియం పవర్‌హౌస్ అని పిలుస్తారు. 100 గ్రాముల రాగిలో దాదాపు 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. రాగి రొట్టెలు, దోశలు, జావ లేదా చిల్లాగా చేసుకుని రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
- మునగ ఆకులు (మోరింగా): మునగ చెట్టు ప్రతి భాగం ఉపయోగకరమే. 100 గ్రాముల మునగ ఆకుల్లో 185 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని పప్పు, సూప్ లేదా కూరల్లో వేసుకోవచ్చు.
- రాజగిరి (అమరాంత్): ఇది కాల్షియం నిధి. 100 గ్రాములలో సుమారు 215 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది ప్రోటీన్, ఫైబర్, ఐరన్ మరియు మెగ్నీషియంకు మంచి వనరు. దీనిని రొట్టెలు లేదా లడ్డూల రూపంలో తినవచ్చు.
- రాజ్మా: ఇందులో ప్రోటీన్ మాత్రమే కాకుండా, 100 గ్రాములలో 143 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే ఇందులో ఫైబర్, ఐరన్ మరియు పొటాషియం కూడా అధికంగా ఉంటాయి.
- ఎండిన అంజూర పండ్లు: ఇవి సహజమైన తీపిని అందించడమే కాకుండా, 100 గ్రాములలో 162 మిల్లీగ్రాముల కాల్షియంని కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్, పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. సాయంత్రం వేళల్లో చిరుతిండిగా వీటిని తీసుకోవచ్చు.
సూచన: పైన పేర్కొన్న పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే, ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని ఆహారంలో చేర్చుకునే ముందు ఒకసారి వైద్యుని సంప్రదించడం మంచిది.
