జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో నిర్వహించిన హోంగార్డు ఉద్యోగ మాక్ రన్నింగ్ టెస్టులో ఓ మహిళ ఎలాంటి ప్రత్యేక శిక్షణ, కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా.. చీర కట్టుకుని ఒట్టికాళ్లతో 1600 మీటర్ల దూరాన్ని పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కుటుంబ జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలనే తపనతో ఆమె పరుగెత్తిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రామ్‌గఢ్ జిల్లాలో ఖాళీగా ఉన్న 284 హోంగార్డు పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 24 నుండి నవంబర్ 5 వరకు అధికారిక నియామక ప్రక్రియ జరగనుంది. ఈ రిక్రూట్మెంట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. అంతేకాకుండా, వితంతువులు మరియు భర్త వదిలేసిన మహిళలకు ప్రత్యేకంగా 5 శాతం కోటా కేటాయించారు.
ఈ అధికారిక పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ‘అంకిత్ రన్నర్ అకాడమీ’ ఆధ్వర్యంలో సిద్ధో-కన్హూ మైదానంలో అక్టోబర్ 2, 4 తేదీలలో మాక్ రన్నింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎందరో మహిళా అభ్యర్థులలో, ఈ మహిళ తీవ్రమైన ఎండలో చీర కట్టుకుని పరుగెత్తిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మాక్ టెస్టులో ఈమె ఒక్కరే కాకుండా, మరికొందరు మహిళలు కూడా చీరలు కట్టుకునే పరుగెత్తి అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు 1600 మీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లోపు పూర్తి చేయాల్సి ఉండగా, 8 నిమిషాల్లోపు పూర్తి చేసిన వారికి ఉత్తమ మార్కులు కేటాయిస్తారు. అదే సమయంలో పురుషులకు ఈ దూరాన్ని పూర్తి చేయడానికి 5 నిమిషాల గడువు ఉంటుంది.
ఎలాంటి ఆధునిక వసతులు, రన్నింగ్ దుస్తులు లేకపోయినా.. కేవలం లక్ష్యం, కుటుంబ సంక్షేమం కోసం ఆ మహిళ చూపిన అంకితభావం, ఆత్మవిశ్వాసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పేదరికం, కష్టాలను అధిగమించి ముందుకు సాగాలనుకునే ఎందరో మహిళల మనోధైర్యానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.

Leave a Reply