కింగ్ కోహ్లీ కౌంటర్: “నేను విదేశీ ఆటగాడిలా కనిపిస్తున్నానా? లండన్ షిఫ్టింగ్‌పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!”

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026లో అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతూ, ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరగనున్న కీలక పోరుకు సిద్ధమవుతున్న తరుణంలో, తనపై వస్తున్న విమర్శలకు కోహ్లీ గట్టి సమాధానమిచ్చారు.

‘విదేశీ ఆటగాడు’ వ్యాఖ్యలపై స్పందన: కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. కేవలం సిరీస్‌లు లేదా టోర్నమెంట్‌ల సమయంలోనే భారత్‌కు వస్తుండటంతో, సోషల్ మీడియాలో ఆయనపై రకరకాల మీమ్స్ వస్తున్నాయి. కొందరు ఆయనను తమాషాగా ‘విదేశీ ఆటగాడు’ అని కూడా పిలుస్తున్నారు. దీనిపై ఆర్సీబీ విడుదల చేసిన ఒక వీడియోలో కోహ్లీ స్పందించారు.

వీడియోలో మిస్టర్ నాగ్స్ కోహ్లీని ఆటపట్టిస్తూ.. “ఈ సీజన్‌లో ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడుతోందని జనాలు అంటున్నారు. అసలు వాళ్లు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు” అని ప్రశ్నించారు. దీనికి కోహ్లీ నవ్వుతూ.. “నన్ను ఎందుకు అడుగుతున్నావు? వెళ్లి ఆ విదేశీ ఆటగాళ్లనే అడుగు. నేనేం విదేశీ ప్లేయర్‌ని కాదు” అని బదులిచ్చారు. అంతేకాకుండా ఎదురు ప్రశ్నిస్తూ.. “నేనేమైనా విదేశీ ప్లేయర్‌లా కనిపిస్తున్నానా?” అని అడగ్గా, హోస్ట్ నవ్వుతూ “ఖచ్చితంగా లేదు” అని సమాధానమిచ్చారు.

ఐపీఎల్ 2025 టైటిల్ విజయంపై: గత ఏడాది (ఐపీఎల్ 2025) ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచిన క్షణాలను కోహ్లీ గుర్తు చేసుకున్నారు. “ట్రోఫీ కోసం మేము చాలా కాలం వేచి చూశాము. గెలిచిన తర్వాత చాలా ఊరటగా అనిపించింది. విజయం అనేది కష్టానికి, త్యాగానికి దక్కిన ప్రతిఫలం. ఓటమి మనకు చాలా నేర్పిస్తుంది, కానీ నిరంతర శ్రమ తర్వాత వచ్చే గెలుపు మరింత మెరుగ్గా రాణించేలా స్ఫూర్తినిస్తుంది” అని కోహ్లీ పేర్కొన్నారు.


Posted

in

by

Tags: