ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని రాజాజీపురం ప్రాంతంలో 31 ఏళ్ల యువకుడు రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు, స్థానికంగా ఉన్న ఒక ఇంట్లోకి ప్రవేశించి పైకి వెళ్లాడు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతను ఒక ఇంటి గుండా పైకి వెళ్లి, పక్కనే ఉన్న మరో ఇంటి డాబాపైకి చేరుకున్నాడు.
అనంతరం రెండో అంతస్తు పిట్టగోడ (రెయిలింగ్) పై నిలబడ్డాడు. అది చూసిన చుట్టుపక్కల ప్రజలు కిందకు దిగి రావాలని ప్రాధేయపడ్డారు. కొందరు అతడిని శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడు చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నట్లు సమాచారం. ఈ దృశ్యాలను ప్రత్యక్ష సాక్షులు తమ ఫోన్లలో రికార్డు చేసి పోలీసులకు అందించారు. ఆ వీడియోలో సదరు యువకుడు దాదాపు ఒక నిమిషం పాటు రెయిలింగ్పై నిలబడి ఉండటం, స్థానికులు అతడిని కిందకు రమ్మని వేడుకోవడం రికార్డయింది.
అయితే, స్థానికుల ప్రయత్నాలు ఫలించలేదు. అందరూ చూస్తుండగానే అతడు హఠాత్తుగా కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు అంబులెన్స్ ద్వారా వెంటనే రాజాజీపురంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడిని మనీష్ కుమార్ శ్రీవాస్తవగా పోలీసులు గుర్తించారు.
గత కొంతకాలంగా మనీష్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చాడు, వేరే ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడు అనే అంశాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
