హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్డులో నిర్మాణంలో ఉండి నిరుపయోగంగా వదిలేసిన ఒక భవనం 12వ అంతస్తు అంచున వీధి కుక్క చిక్కుకుపోయిన ఘటన ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బుధవారం ఉదయం, పక్కనే ఉన్న మరో భవనంలో నివసించే ఒక వ్యక్తి.. ఈ కుక్క అత్యంత ప్రమాదకర స్థితిలో బాల్కనీ అంచున నిలబడి ఉండటాన్ని గమనించాడు. ఏ క్షణంలోనైనా కింద పడిపోయే భయానక వాతావరణంలో ఆ మూగజీవం బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో తల్లడిల్లిపోయింది.
పరిస్థితి తీవ్రతను గ్రహించిన సదరు వ్యక్తి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 112కి కాల్ చేసి సమాచారం అందించాడు. సమాచారం అందిన కేవలం 30 నిమిషాల్లోనే హర్యానా అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనుషులను చూసి కుక్క భయపడి పొరపాటున కింద పడిపోకూడదనే ఉద్దేశంతో.. ఎలాంటి శబ్దం చేయకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి ఆ కుక్కను సురక్షితంగా రక్షించారు.
సురక్షితంగా బయటపడిన తర్వాత, ఆ కుక్కకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఎంతో ఉల్లాసంగా తోక ఊపుతూ వెళ్లడం కనిపించింది. నెటిజన్లు ‘డోగేశ్ భాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటున్న ఈ కుక్క రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సరైన సమయంలో సమాచారం అందించిన వ్యక్తిని, మెరుపు వేగంతో స్పందించిన రెస్క్యూ సిబ్బందిని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. అయితే, అంత ఎత్తయిన 12వ అంతస్తు వరకు ఆ కుక్క ఎలా వెళ్లిందనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.

Leave a Reply