న్యూఢిల్లీ: నేటి ఆధునిక జీవనశైలిలో గుండెపోటు కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. వృద్ధులే కాకుండా యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆలోక్ చోప్రా మన వంటింట్లో నిత్యం వాడే ఐదు తెల్లని పదార్థాలు గుండె ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో వివరిస్తూ సోషల్ మీడియాలో కీలక సమాచారాన్ని పంచుకున్నారు. “మనం తినే ఆహారమే మనల్ని నిర్మిస్తుంది.. అందుకే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి” అని ఆయన సూచించారు.
1. తెల్ల చక్కెర (వైట్ షుగర్): ఖాళీ కేలరీల గని
చక్కెర కేవలం రుచిని ఇస్తుంది తప్ప ఎలాంటి పోషకాలను అందించదు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి, ప్రేగుల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
- ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు: బెల్లం, స్వచ్ఛమైన తేనె, ఖర్జూరం, కొబ్బరి చక్కెర.
2. మైదా (వైట్ ఫ్లోర్): శరీరానికి భారమే!
మైదాలో పీచు పదార్థం (ఫైబర్) అస్సలు ఉండదు. శరీరంలో ఇది చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. గోధుమల్లో ఉండే పోషకాలన్నీ మైదా తయారీలో తొలగిపోతాయి.
- ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు: తృణధాన్యాలు, ముడి గోధుమ పిండి.
3. తెల్ల ఉప్పు (వైట్ సాల్ట్): రసాయనాల ముప్పు
సాధారణ తెల్ల ఉప్పు తయారీలో సహజ ఖనిజాలను తొలగించి, కొన్ని రసాయనాలను కలుపుతారు. ఉప్పును పూర్తిగా మానేయకూడదు కానీ, పరిమితంగా వాడటం శ్రేయస్కరం.
- ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు: సైంధవ లవణం (Saindhava Lavanam), హిమాలయన్ పింక్ సాల్ట్, సముద్రపు ఉప్పు.
4. రిఫైన్డ్ ఆయిల్: మంటకు కారణం
కెమికల్స్ ఉపయోగించి తయారు చేసే రిఫైన్డ్ ఆయిల్స్ శరీరంలో వాపులను (Inflammation) కలిగిస్తాయి. ఇవి గుండె ధమనుల పనితీరును దెబ్బతీస్తాయి.
- ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు: గానుగ పట్టించిన ఆవ నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, నెయ్యి, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్.
5. పాలిష్ చేసిన బియ్యం: పోషకాలు లేని మెరుపు
చూడటానికి తెల్లగా నిగనిగలాడే బియ్యం గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి.
- ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు: దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్, ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, చిరుధాన్యాలు (మిల్లెట్స్).
మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే కిచెన్‌లోని ఈ ఐదు వస్తువులను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. రుచి కంటే ఆరోగ్యమే ముఖ్యమని గుర్తించాలని వారు కోరుతున్నారు.
