చాలా ఇళ్లలో భోజనం చేసిన వెంటనే పాత్రలు కడిగే అలవాటు ఉండదు. రోజంతా వాడిన పాత్రలను సింక్‌లో వేసి, వాటిని మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తారు. కానీ, ఇలా పాత్రలను రాత్రంతా సింక్‌లో నానబెట్టడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మీ వంటగది సింక్ ప్రమాదకరమైన బ్యాక్టీరియాల స్థావరంలా మారుతుంది.
సింక్‌లో పాత్రలు వదిలేయడం ఎందుకు ప్రమాదకరం?
సింక్‌లో అంటు పాత్రలను అలాగే ఉంచడం వల్ల అక్కడ బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మైక్రోబయాలజిస్టుల ప్రకారం, తేమ మరియు వెచ్చని వాతావరణం ఉండే సింక్ ప్రాంతం హానికరమైన సూక్ష్మజీవులు పెరగడానికి అనువైన చోటు.
వంటగది సింక్ – క్రిములకు ‘స్వర్గధామం’
బ్రిటన్‌లోని కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో, వంటగదిలోని సింక్ ప్రాంతంలోనే అత్యధిక క్రిములు ఉన్నట్లు తేలింది. మనం కూరగాయలు కడగడం, చేపలు లేదా చికెన్ శుభ్రం చేయడం వంటి పనులన్నీ సింక్ వద్దే చేస్తాము. దీనివల్ల అక్కడ అనేక రకాల బ్యాక్టీరియాలు చేరుతాయి.
సింక్‌లో కనిపించే ప్రమాదకర బ్యాక్టీరియాలు:
- ఈ.కోలి (E. coli): ఇది చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల జ్వరం, వాంతులు మరియు విరేచనాలు కలుగుతాయి. దీర్ఘకాలంలో ఇది కోలన్ క్యాన్సర్ (పెద్దప్రేగు క్యాన్సర్) వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
- ఎంట్రోబాక్టర్ క్లోకే (Enterobacter cloacae)
- క్లెబ్సియెల్లా న్యుమోనియా (Klebsiella pneumoniae)
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- వెంటనే కడిగేయండి: భోజనం చేసిన వెంటనే పాత్రలను కడిగేసి, సింక్‌ను కూడా శుభ్రం చేయాలి.
- స్పాంజ్‌ల శుభ్రత: పాత్రలు కడగడానికి వాడే స్పాంజ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వీలైతే, స్పాంజ్‌ను మైక్రోవేవ్‌లో కొద్దిసేపు ఉంచడం వల్ల అధిక ఉష్ణోగ్రతకు దానిలోని క్రిములు చనిపోతాయి.
- పరిసరాల శుభ్రత: పాత్రలు కడిగిన తర్వాత సింక్ చుట్టుపక్కల ప్రాంతాన్ని పొడిగా ఉండేలా తుడుచుకోవాలి.
గమనిక: ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం వంట గదిని మాత్రమే కాదు, వంటకు వాడే వస్తువులను మరియు సింక్ ప్రాంతాన్ని ప్రతిరోజూ శుభ్రపరచడం చాలా ముఖ్యం.
