గాయకుడు, నటుడు, దర్శకుడు.. ఇలా భారతీయ సినిమా చరిత్రలో కిషోర్ కుమార్ ఒక అద్భుతమైన అధ్యాయం. ఆయన పాటలు నేటికీ తరాలను అలరిస్తూనే ఉన్నాయి. అయితే, వెండితెరపై అందరినీ నవ్వించే కిషోర్ కుమార్, వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండేవారు? ఆయన ప్రవర్తన వెనుక ఉన్న వింత పోకడల గురించి ఆయన నాలుగో భార్య లీనా చంద్రవర్కర్ ఇటీవల ఒక పాత ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకున్నారు.
లీనా కథనం ప్రకారం.. కిషోర్ కుమార్ మూడ్ క్షణక్షణానికి మారిపోయేదని, అది తనను తీవ్ర భయాందోళనకు గురిచేసేదని తెలిపారు. ‘లెహ్రెన్ రెట్రో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఒక భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు.
“ఆయన ముఖం మనిషిలా కాకుండా జంతువులా మారిపోయింది”
‘ప్యార్ అజ్నబీ హై’ సినిమా షూటింగ్ సమయంలో మేకప్ రూమ్లో ఉన్నప్పుడు కిషోర్ కుమార్ అకస్మాత్తుగా లీనాను ఒక ప్రశ్న అడిగారు. చిత్ర పరిశ్రమలో తన గురించి ఆమె ఏం విన్నారని పదే పదే ప్రశ్నించారు. లీనా మొదట సమాధానం చెప్పడానికి నిరాకరించినప్పటికీ, ఆయన పట్టుబట్టడంతో.. “మీరు గొప్ప గాయకుడు మరియు హాస్యనటుడని విన్నాను” అని చెప్పారు.
ఆ సమాధానంతో కిషోర్ సంతృప్తి చెందలేదు. లీనా చెబుతూ.. “ఆ తర్వాత ఆయన ముఖకవళికలు పూర్తిగా మారిపోయాయి. మనిషిలా కాకుండా ఒక క్రూర మృగంలా భయంకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. సోఫాపైకి ఎగిరి గంతులేస్తూ పిచ్చివాడిలా ఊపిరి పీల్చుకోవడం చూసి నేను వణికిపోయాను. భయంతో నేను గది నుండి పారిపోవడానికి ప్రయత్నించాను. చివరికి నేను తట్టుకోలేక ‘అవును, మీరు ఒక పిచ్చివాడని విన్నాను!’ అని గట్టిగా అరిచాను. అంతే.. మరుక్షణం ఆయన మళ్ళీ మామూలు మనిషిలా నవ్వడం మొదలుపెట్టారు” అని వివరించారు.
నిజానికి, తనను తాను ‘పిచ్చివాడు’ అని పిలుచుకోవడం ఆయనకు ఎంతో ఇష్టమని లీనా పేర్కొన్నారు.
ఐదో పెళ్లి చేసుకుంటారేమోనన్న భయం
కిషోర్ కుమార్కు నాలుగో భార్య కావడంతో లీనా మనసులో ఎప్పుడూ ఒక రకమైన అభద్రతాభావం ఉండేది. ఆయన ఎక్కడ తనను వదిలేసి ఐదో పెళ్లి చేసుకుంటారో అని ఆమె నిరంతరం భయపడేవారు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒకసారి ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఆమె టాక్సీ ఎక్కుతున్న సమయంలో కిషోర్ కుమార్ గట్టిగా అరుస్తూ.. “వెళ్ళిపో! ఇక ఎప్పుడూ తిరిగి రాకు, నాతో మాట్లాడకు!” అని కేకలు వేశారు. అయితే, కిషోర్ కుమార్ సహచరులు ఆమెను ఆపి.. “మీరు వెళ్ళిపోతే ఆయన మళ్ళీ పాత పద్ధతిలోకి మారిపోతారు, మీ వల్లే ఆయనలో మార్పు వచ్చింది” అని నచ్చజెప్పడంతో ఆమె ఆగిపోయారు. కిషోర్ కుమార్ ప్రతిభ ఎంత గొప్పదో, ఆయన వ్యక్తిత్వం అంత క్లిష్టంగా ఉండేదని లీనా మాటలు స్పష్టం చేస్తున్నాయి.
