న్యూఢిల్లీ: వీధి కుక్కల సంరక్షణకు సంబంధించి డాగ్ లవర్స్ (జంతు ప్రేమికులు) దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జంతు సంక్షేమ బోర్డులు జారీ చేసిన కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) మార్గదర్శకాలను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సుప్రీంకోర్టు తన తీర్పును మూడు భాగాలుగా విభజించి మంగళవారం ఈ కీలక ఆదేశాలను వెలువరించింది.
కోర్టు తన పాత తీర్పులోని అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రమాదకరమైన వీధి కుక్కల కోసం ‘షెల్టర్ హోమ్స్’ (ఆశ్రయ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల నుండి వీధి కుక్కలను తొలగించాలని మరియు బహిరంగ ప్రదేశాలలో వాటికి ఆహారం పెట్టడాన్ని నిషేధించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న కుక్కల కాటు ఘటనలను సుప్రీంకోర్టు ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఘటనల్లో ముఖ్యంగా చిన్నారులు, మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 2001లోనే యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనలు అమలులోకి వచ్చిన విషయాన్ని కోర్టు మరువలేదని, అయితే వీధి కుక్కల జనాభా పెరుగుతున్న నిష్పత్తికి అనుగుణంగా షెల్టర్ హోమ్‌లు మరియు ఇతర వసతుల అభివృద్ధి జరగలేదని అస్సంతృప్తి వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ – ముఖ్యాంశాలు (Supreme Court Verdict on Stray Dogs):
- వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స) మరియు వ్యాక్సినేషన్ (టీకాలు వేయడం) తప్పనిసరి.
- మునిసిపల్ కార్పొరేషన్లు వీధి కుక్కలను పట్టుకుని, వాటికి స్టెరిలైజేషన్ మరియు టీకాలు వేసే బాధ్యతను చేపట్టాలి.
- సాధారణ, ఆరోగ్యకరమైన కుక్కలకు స్టెరిలైజేషన్ మరియు వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత, వాటిని ఏ ప్రాంతం నుండి అయితే పట్టుకున్నారో మళ్లీ అదే ప్రాంతంలో వదిలిపెట్టాలి.
- రేబిస్ సోకిన మరియు అత్యంత ప్రమాదకరంగా మారిన కుక్కలను మళ్లీ వీధుల్లోకి వదలకూడదు, వాటిని ప్రత్యేక షెల్టర్ హోమ్‌లలోనే ఉంచాలి.
- వ్యాధి సోకిన మరియు హింసాత్మక ప్రవర్తన కలిగిన కుక్కల కోసం విడిగా ప్రత్యేక షెల్టర్లను సిద్ధం చేయాలి.
- బహిరంగ ప్రదేశాలు, గల్లీలు లేదా రహదారులపై వీధి కుక్కలకు ఆహారం (ఫీడింగ్) పెట్టడానికి వీల్లేదు.
