మహారాష్ట్రలోని బుల్ఢానా జిల్లా, రాజూరా శివారులో ఒక తండ్రి తన నలుగురు పిల్లలను బావిలో పడేసి, తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన మే 25న వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణ ఘటనలో తండ్రితో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
ఏం జరిగింది? ప్రాథమిక విచారణ ప్రకారం, విజయ్ మూసా కిరాడియా (27, రాజూరా గ్రామం) కుటుంబ కలహాల కారణంగానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 24 అర్ధరాత్రి సమయంలో, తన పిల్లలైన ప్రీత్ (7), ప్రాచీ (5), పూర్వి (3), పియూష్ (1.5 ఏళ్లు)లను బావిలో పడేసి, ఆ తర్వాత తండ్రి విజయ్ కూడా దూకేశాడు.
మే 25 ఉదయం బావిలో మృతదేహాలు తేలుతుండటాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జలగావ్ జమోద్ పోలీసులు, మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల వల్లే ఈ ఘోరం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
