“కుళ్లిన టమాటాల కోసం భార్యను కొట్టిన భర్త..!” లక్నోలో జరిగిన దారుణ డబుల్ మర్డర్ వెనుక ఇంత కథ ఉందా..? వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు..!!

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గల ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ వెలుపల దివ్య మిశ్రా అనే మహిళను ఆమె భర్త మనస్ వాజ్‌పేయి తుపాకీతో కాల్చి చంపాడు.

వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, భర్త వేధింపులు తాళలేక గత ఏడాది కాలంగా ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఘటన జరిగిన రోజు బ్యాంక్ బయట భార్యను కలిసిన మనస్, కాసేపు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్యను చంపిన తర్వాత ఇంటికి చేరుకున్న అతను, మానసిక సమస్యలతో బాధపడుతున్న తన సొంత సోదరి శివ వాజ్‌పేయిని కూడా తుపాకీతో కాల్చి చంపాడు.

ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే తానూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు, “నన్ను మోసం చేసిన భార్యను, నా సోదరిని చంపేశాను” అని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. మృతురాలు దివ్య సోదరి, ప్రముఖ యూట్యూబర్ ప్రగ్యా మిశ్రా మాట్లాడుతూ.. మనస్ తీవ్రమైన సైకోలా ప్రవర్తించేవాడని ఆరోపించారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన టమాటాలు కుళ్లిపోయి వచ్చినా దివ్యను చితకబాదేవాడని, పెళ్లయిన మొదటి రోజే ఇంటి ఖర్చులను చెరిసగం పంచుకోవాలని వేధించాడని తెలిపారు. అతని పైశాచికత్వాన్ని తట్టుకోలేకే దివ్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిందని ఆమె పేర్కొన్నారు.

ఈ దారుణ హత్యలు చేసిన తర్వాత ఇంటికి వచ్చిన మనస్, గబగబా హనుమాన్ చాలీసా పఠించాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఆ తర్వాతే అతను ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణ బ్యాంక్ ఉద్యోగి అయిన మనస్‌కు మూడు తుపాకులు ఎలా వచ్చాయి? అసలు కారు నడపడం కూడా రాని అతను ఇంత పక్కాగా దాడి ఎలా చేయగలిగాడు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అని ప్రగ్యా అనుమానాలు వ్యక్తం చేశారు.

తీవ్ర మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగా కొద్దిరోజుల క్రితమే దివ్య రోడ్డు ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు విరిగాయని.. ఇన్ని కష్టాలు పడుతున్నా ఎప్పటికైనా తన భర్త మారతాడనే ఆశతోనే ఆమె బతికిందని ప్రగ్యా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: