పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోందని అంతర్జాతీయ మానవతా సహాయ సంస్థ ‘యాక్షన్ అగైన్స్ట్ హంగర్’ (Action Against Hunger) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల జాబితాలో పాకిస్తాన్ కూడా చేరింది. పెరిగిపోయిన పేదరికం, ఆకాశాన్నంటుతున్న ధరలు, నిరుద్యోగం, వరుస ప్రకృతి వైపరీత్యాలు, తగ్గుముఖం పట్టిన అంతర్జాతీయ మానవతా సహాయాలు ఈ దుస్థితికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.
2026 నాటికి పాకిస్తాన్‌లో దాదాపు 1.06 కోట్ల మంది ప్రజలకు తక్షణ మానవతా సాయం అవసరమవుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో స్వల్ప పురోగతి కనిపించినప్పటికీ, నిరుపేద, బడుగు బలహీన వర్గాల దైనందిన కష్టాలు ఏమాత్రం తగ్గలేదు. నిత్యావసర ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో అల్పాదాయ కుటుంబాలు కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఈ నివేదిక ప్రకారం అత్యంత తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న 10 దేశాల జాబితాలో నైజీరియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సూడాన్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణ సూడాన్, సిరియా ఉన్నాయి. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల్లో సుమారు 26.6 కోట్ల మంది తీవ్రమైన ఆకలితో అలమటిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
పాకిస్తాన్‌లో తరచూ సంభవిస్తున్న ఆకస్మిక వరదలు, కరవు కాటకాలు, తీవ్రమైన ఎండలు, రుతుపవనాల గమనంలో మార్పులు వ్యవసాయాన్ని, పశుపోషణను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో ప్రజల జీవనోపాధి నాశనమవడంతో పాటు తిండి దొరకడమే గగనంగా మారింది. ఖర్చులను తగ్గించుకోవడానికి చాలా కుటుంబాలు పూటకో ముద్దతో కడుపు నింపుకుంటున్నాయని, ఆస్తులను అమ్ముకోవడంతో పాటు పిల్లల చదువులను సైతం అర్ధాంతరంగా ఆపేస్తున్న పరిస్థితి దాపురించిందని నివేదిక పేర్కొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆహార సహాయం, తాగునీరు, పారిశుధ్యం, సామాజిక భద్రత కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టడం ఎంతో ఆవశ్యకమని స్పష్టమవుతోంది.

Leave a Reply