బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అదే పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడితో ఆ యువతి ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడం, ఆ విషయం ఊరంతా వ్యాపించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కూతురి ప్రేమ వ్యవహారం బయటపడి పరువు పోతుందన్న భయంతో, కుటుంబ పరువు కాపాడుకోవాలనే నెపంతో తల్లే స్వయంగా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ కట్టుకథలు అల్లిన తల్లి, కుటుంబ సభ్యులు.. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి సమీపంలోని మామిడి తోటలోనే మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. అంతటితో ఆగకుండా, తాము చేసిన ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని పాతిపెట్టిన చోటే ఓ మామిడి మొక్కను కూడా నాటారు. అయితే, ఆ యువతి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంపై గ్రామస్థుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఊరు విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన యువతి తల్లిని అదుపులోకి తీసుకుని పోలీసులు గట్టిగా విచారించడంతో ఈ భయానక నిజం బయటపడింది.
పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ఆ ప్రాంతంలో నిలిచిన వర్షపు నీటిని పంపుసెట్ల ద్వారా తొలగించి, సుమారు 8 నుంచి 10 గంటల పాటు శ్రమించి ఆ ప్రదేశాన్ని తవ్వారు. ఆ తవ్వకాల్లో పూడ్చిపెట్టిన అస్థిపంజరం అవశేషాలు లభ్యం కావడంతో వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. ఈ ఘటనతో సంబంధమున్న తల్లి, సోదరితో పాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది పథకం ప్రకారం చేసిన పరువు హత్యేనా లేక ఆత్మహత్యను కప్పిపుచ్చేందుకు చేసిన పనా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply