మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బోరివలి ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఆగస్టు 22న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.
దీంతో కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మొబైల్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేయగా.. ఆ బాలిక మొదట ఆటోలో బోరివలి రైల్వే స్టేషన్కు వెళ్లి, అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి మథురకు చేరుకున్నట్లు తేలింది.
మథురకు చేరుకున్న ఆ బాలిక అక్కడి శ్రీకృష్ణుడు, రాధాదేవికి సంబంధించిన ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటోంది. ఈ క్రమంలో ముంబై పోలీసులు మథుర, బృందావనం, నిధివనం, బర్సానా, యమునా నదీ తీర ప్రాంతాల్లో నిరంతరం గాలించారు. ఆలయాలు, ఆశ్రమాలు, ధర్మశాలలు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా ఆరా తీశారు. స్థానికులు, భక్తులు, స్వచ్ఛంద సేవకులను కూడా ప్రశ్నించారు. అయినప్పటికీ మూడు రోజులైనా ఆచూకీ దొరకకపోవడంతో దర్యాప్తు బృందం తీవ్ర నిరాశకు గురైంది.
ఈ క్రమంలో గాలింపు చర్యల్లో ఉన్న ముంబై పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (పీఎస్ఐ) సురేంద్ర లోఖండే బర్సానాలోని ప్రసిద్ధ రాధారాణి ఆలయానికి వెళ్లారు. అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఎదుట నిలబడి.. “ఎలాగైనా ఆ బాలికను సురక్షితంగా కనిపెట్టేలా దారి చూపించు” అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించారు. మొక్కుకున్న తర్వాత కళ్లు తెరిచి చూడగా, తాము మూడు రోజులుగా వెతుకుతున్న ఆ 13 ఏళ్ల బాలిక అక్కడే ఆయన పక్కనే నిలబడి ఉండటం గమనించారు. మొదట ఆయన తన కళ్లను తానే నమ్మలేకపోయారు. వెంటనే తన మొబైల్లోని ఫొటోతో సరిచూసుకుని, పేరు పెట్టి పిలిచి ఆ పాపేనని నిర్ధారించుకున్నారు.
అనంతరం పోలీసులు ఆ బాలికకు ధైర్యం చెప్పి సురక్షితంగా ముంబైకి తీసుకొచ్చారు. మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా గడిపిన కుటుంబసభ్యులు, కూతురు క్షేమంగా దొరకడంతో కన్నీటిపర్యంతమై ఊపిరి పీల్చుకున్నారు. ఒకవైపు పోలీసుల నిరంతర శ్రమ, మరోవైపు ఆలయంలో అధికారి చేసిన ప్రార్థన వెరసి.. ఆ బాలిక దొరికిన అద్భుత ఘట్టం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికర చర్చకు దారితీసింది.

Leave a Reply