కెనడా క్రికెట్ ఫిక్సింగ్ కుంభకోణం వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా? సంచలన నిజాలు వెలుగులోకి!

కెనడా క్రికెట్ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణానికి తాజా బలిపశువుగా మారింది. ఫిబ్రవరి 17న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కెనడా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అవినీతి నిరోధక విభాగం ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

ఈ మ్యాచ్‌లో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఒక అత్యంత ఖరీదైన ఓవర్ (ఎక్కువ పరుగులు ఇచ్చిన ఓవర్)పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఐసీసీ అతడిని విచారించడమే కాకుండా, ఆధారాల కోసం అతని మొబైల్ ఫోన్‌ను కూడా సోదా చేసింది. అయితే, ఈ కుంభకోణం వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా హస్తం ఉన్నట్లు తాజాగా వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది.

కెనడా క్రికెట్‌తో బిష్ణోయ్ ముఠా సంబంధం: కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం.. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనల వెనుక ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణానికి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించింది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి కొన్ని వారాల ముందే దిల్‌ప్రీత్ బజ్వా కెనడా జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడంలో ఈ ముఠా కీలక పాత్ర పోషించింది. బజ్వా నియామకాన్ని వ్యతిరేకించిన ఆటగాళ్లను ఈ ముఠా బెదిరించినట్లు తెలుస్తోంది.

జులై 2025లో బ్రిటిష్ కొలంబియాలోని ఒక రెస్టారెంట్‌లో కెనడా జాతీయ జట్టు ఆటగాడిని బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కలిశారని, దిల్‌ప్రీత్ బజ్వాకు మద్దతు ఇవ్వకపోతే అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ముఠా తమకు అనుకూలమైన ఆటగాళ్లను, అధికారులను కీలక పదవుల్లో కూర్చోబెట్టినట్లు ఆ నివేదిక పేర్కొంది.

క్రికెట్ కెనడా అధ్యక్షుడి పాత్రపై అనుమానాలు? ప్రస్తుత క్రికెట్ కెనడా అధ్యక్షుడు అరవిందర్ ఖోసాకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉండవచ్చని ఈ నివేదిక అనుమానిస్తోంది. అయితే ఖోసా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు, తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. కానీ, బజ్వాను కెప్టెన్ చేయడానికి ఖోసా మొదటి నుండి ప్రయత్నించారని జట్టు సభ్యుడొకరు ఆరోపించారు. “కేవలం డబ్బు సంపాదించడానికి మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలనేది వారి ఉద్దేశం, అందుకే తమకు అనుకూలమైన వ్యక్తిని కెప్టెన్ చేశారు” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ఆటగాడు తెలిపాడు.

అంతేకాకుండా, కెనడా మాజీ కోచ్ ఖుర్రం చోహాన్‌ను కూడా అప్పటి బోర్డు సభ్యులు మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని కోరినట్లు సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తోంది. కెనడా అధికారులు ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసిన సంగతి తెలిసిందే.


Posted

in

by

Tags: