కె.ఎస్. చిత్ర: ‘కుమార్తె మరణం తర్వాత గుడికి వెళ్లలేదు, ఎవరినీ కలవలేదు’ – మనసు విప్పిన చిత్ర

తన కుమార్తె మరణం తర్వాత తాను ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక ఒత్తిడి గురించి గాయని కె.ఎస్. చిత్ర మొదటిసారిగా మనసు విప్పి మాట్లాడారు. సంగీత ప్రపంచానికి, దైవచింతనకు దూరమైన తనను ఇళయరాజా, లతా మంగేష్కర్ వంటి వారు తిరిగి ఎలా మామూలు మనిషిని చేశారో ఆమె వివరించారు.

దక్షిణ భారత ‘చిన్నకుయిల్’ అని పిలవబడే చిత్ర పాట వినకుండా మన రోజు గడవదు. అనేక భాషల్లో వేల పాటలు పాడిన చిత్ర కుమార్తె నందన ఈ లోకాన్ని విడిచి వెళ్లి అప్పుడే 15 ఏళ్లు అవుతోంది. 2011లో దుబాయ్‌లోని ఒక విల్లా స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు పడి తొమ్మిదేళ్ల నందన ప్రాణాలు కోల్పోయింది. ఆ పెద్ద షాక్ నుండి తాను ఎలా కోలుకున్నారో చిత్ర ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంగా పంచుకున్నారు.

తిరిగి సంగీత ప్రపంచంలోకి..
“నన్ను మళ్లీ పాడించేందుకు రంజినీ హరిదాస్, విజయ్ టీవీ రౌఫ్ వంటి వారు చాలా ప్రయత్నించారు. నేను వస్తేనే షూటింగ్ మొదలుపెడతామని వేచి చూసేవారు. కానీ నాకు అప్పుడు తిరిగి రావాలన్న ఆలోచనే లేదు. ఆ సమయంలోనే నాకు లతా మంగేష్కర్ పేరుతో ఒక అవార్డు వచ్చింది. హైదరాబాద్ వెళ్లి దానిని అందుకోవాలి, కానీ నేను ఎక్కడికీ వెళ్లే స్థితిలో లేను. అప్పుడు లతా జీ స్వయంగా ఫోన్ చేసి.. ‘నువ్వు కచ్చితంగా రావాలి’ అని చెప్పారు” అని చిత్ర గుర్తు చేసుకున్నారు.

“చాలా గ్యాప్ తర్వాత నేను మళ్లీ పాడటం మొదలుపెట్టాను. అది కూడా ఇళయరాజా గారి ప్రోగ్రామ్. ‘నేను పాడలేను’ అని ఆయనతో చెప్పాను. కానీ, ‘నువ్వు రాకపోతే ఈ ప్రోగ్రామ్ రద్దు చేస్తాను’ అని ఆయన మొండికేశారు. అప్పటికి ఆయన భార్య చనిపోయి కేవలం మూడు నెలలే అవుతోంది. ‘నాతో 33 ఏళ్లు జీవించిన ఆవిడ వెళ్లిపోయింది, నేను ప్రోగ్రామ్‌కి రాలేదా? నువ్వు అలా అనుకోకూడదు, కచ్చితంగా రావాలి’ అని చెప్పి నన్ను ఒప్పించారు” అని చిత్ర చెప్పుకొచ్చారు.

దేవుడితో దూరం.. తిరిగి గురువాయూరప్ప పిలుపు
ఆ సమయంలో తనకు దేవుడికి మధ్య ఒక దూరం ఏర్పడిందని చిత్ర పేర్కొన్నారు. “ఇలా జరగడానికి నేను ఏం తప్పు చేశాను? ఎవరినైనా నొప్పించానా? రియాలిటీ షోలలో పిల్లలను ఏదైనా అని వారి మనసు నొప్పించానా? అది శాపంగా మారిందా? ఇలా ఎన్నో ఆలోచనలు వచ్చేవి. అప్పుడు నాకు ఏ గుడికి వెళ్లాలని అనిపించలేదు, ఎవరినీ చూడాలని లేదు. ఆ సమయంలో త్రిచూర్‌లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ గది కోసం వెతికితే అది గురువాయూర్ ఆలయానికి దగ్గరలోనే దొరికింది. భగవంతుడే నన్ను మళ్లీ పిలుస్తున్నాడని నాకు అనిపించింది. ఆ రోజు గుడికి వెళ్లి చాలా సేపు ఏడ్చి తిరిగి వచ్చాను” అని ఆమె తెలిపారు.

నిజం తెలుసుకున్నాను..
“మనం ఇలా ఇంటికే పరిమితమై బాధపడటం వల్ల మనతో ఉన్నవారి జీవితాలు కూడా కష్టమవుతాయి తప్ప, మనం కోల్పోయినది తిరిగి రాదు అని ఒకానొక దశలో నాకు అర్థమైంది. నా చుట్టూ చాలా మంది ఉన్నారు. నేను నీరసించిపోతే వారి జీవితాలు కూడా చిన్నబోతాయి కదా? మనం ఎన్నో కలలు కంటాం, అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాం. కానీ ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. దేవుడి నిర్ణయమే ఆఖరిది. ఆ సంఘటన తర్వాత నేను ప్లాన్ చేసుకోవడమే మానేశాను. ఏది వస్తే దానిని అప్పుడు ఎదుర్కోవాలి. రేపటి కోసం దేన్నీ దాచుకోవడంలో అర్థం లేదు” అని చిత్ర ఎంతో ఉద్వేగంగా ముగించారు.


Posted

in

by

Tags: