అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో జరిగిన పాత వస్తువుల అమ్మకాల్లో (గ్యారేజ్ సేల్), మ్యూజిక్ రికార్డులను కొనుగోలు చేయడానికి వెళ్లిన ఒక వ్యక్తి కేవలం 30 అమెరికన్ డాలర్లకు, అంటే సుమారు రూ.2,800లకు ఒక పెయింటింగ్‌ను కొనుగోలు చేశాడు.
ఒక సాధారణ పెయింటింగ్ అని భావించి కొనుగోలు చేసిన ఆ కళాఖండం, ఆ తర్వాత ప్రసిద్ధ అమెరికన్ చిత్రకారిణి గెర్ట్రూడ్ అబెర్క్రోంబీకి (Gertrude Abercrombie) చెందిన, ఎన్నో ఏళ్లుగా కనిపించకుండా పోయిన అరుదైన పెయింటింగ్ అని తేలింది.
1951లో గీసిన ఆ పెయింటింగ్‌కు ‘ఆల్డర్‌మాన్ మెరియమ్స్ షెల్స్’ (Alderman Merriam’s Shells) అని పేరు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా అది ఎక్కడుందో తెలియని స్థితిలో ఉండగా, తాజాగా ఆ పెయింటింగ్‌ను గుర్తించారు. ఆ పెయింటింగ్ అసలు విలువ తెలియగానే, దానిని ఓ వేలం సంస్థ ద్వారా అమ్మకానికి పెట్టారు.
న్యూయార్క్‌లో జరిగిన వేలంలో ఆ పెయింటింగ్ 13 లక్షల 52 వేల 600 అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 13 కోట్లు. కొన్న ధరతో పోల్చి చూస్తే, ఆ పెయింటింగ్ విలువ వేల రెట్లు పెరిగింది. అంతేకాకుండా, అబెర్‌క్రోంబీ గీసిన పెయింటింగ్స్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక వేలం ధర ఇదే కావడం విశేషం.
వేలానికి ముందు ఈ పెయింటింగ్ 15 వేల నుంచి 2.5 లక్షల అమెరికన్ డాలర్ల వరకు అమ్ముడుపోవచ్చని అంచనా వేశారు. కానీ, ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. కేవలం రూ. 2,800లకు కొన్న ఒక పాత పెయింటింగ్, ఆ తర్వాత రూ. 13 కోట్ల విలువైన అరుదైన కళాఖండంగా మారిన ఘటన ప్రస్తుతం కళా ప్రపంచంలో (ఆర్ట్ వరల్డ్) ఆసక్తికరంగా మారింది.

Leave a Reply