“కొంచెమైనా సిగ్గు, శరం ఉండాలి!” – పార్లమెంట్‌లో రక్షణ మంత్రిని ఉతికిపారేసిన మౌలానా. నవ్వులతో దద్దరిల్లిన పాకిస్థాన్ పార్లమెంట్..!!!

ఇరాన్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పాల్గొన్న ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి రక్షణ మంత్రే స్వయంగా హాజరుకాకపోవడాన్ని ఎత్తిచూపుతూ, పాకిస్థాన్ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత మౌలానా ఫజలుర్ రెహ్మాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ను ఓ ఆట ఆడుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది, సభలో నవ్వులు పూయించింది.

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన జేయూఐ-ఎఫ్ (JUI-F) అధినేత మౌలానా ఫజలుర్ రెహ్మాన్.. టెహ్రాన్‌లో జరిగిన కీలకమైన ప్రాంతీయ భద్రతా సమావేశానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ హాజరైన విషయాన్ని ప్రస్తావించారు.

ఈ క్రమంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వైపు చూస్తూ.. “ఇరాన్‌లో ఏకంగా ఓ భద్రతా ఒప్పందమే రూపుదిద్దుకుంటోంది. అక్కడ దేశానికి సంబంధించిన అత్యంత కీలక సమావేశం జరుగుతోంది. కానీ, పాకిస్థాన్ రక్షణ మంత్రి మాత్రం ఇక్కడ పార్లమెంట్‌లో తీరిగ్గా కూర్చున్నారు!” అని ఆయన ఎద్దేవా చేయడంతో, సభలోని ఎంపీలంతా బల్లలు చరుస్తూ నవ్వుల్లో మునిగిపోయారు.

అనంతరం మౌలానా ఫజలుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షాలను విమర్శించేందుకు ఆసిఫ్ వాడిన పదాలనే ఉపయోగిస్తూ, “మీ గౌరవం, హోదా మీకున్నాయి… కానీ, దానికి తగినట్లుగా ‘కొంచెమైనా సిగ్గు, శరం తెచ్చుకోండి’ (హయా ఔర్ షరమ్)” అంటూ ముఖం మీద కొట్టినట్లు విమర్శించారు.

టెహ్రాన్‌లో జరిగిన ఈ సమావేశంలో సౌదీ అరేబియా రక్షణ మంత్రి యువరాజు ఖలీద్ బిన్ సల్మాన్, టర్కీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇబ్రహీం కాలిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తదితర ముఖ్య నేతలు పాల్గొనగా, పాకిస్థాన్ రక్షణ మంత్రికి అక్కడ స్థానం లేకపోవడం.. ఆ దేశ పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఉన్న ఆధిపత్య పోరును మరోసారి బట్టబయలు చేసింది.

మౌలానా చేసిన ఈ తీవ్ర విమర్శలపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివరణ ఇస్తూ.. టెహ్రాన్ సమావేశంలో ఎలాంటి భద్రతా ఒప్పందంపై చర్చ జరగలేదని, ఆ సమావేశం తన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పరిధిలోకి రాదని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, పాకిస్థాన్ దేశ దౌత్య, భద్రతా వ్యవహారాలన్నీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతుల్లోనే ఉన్నాయన్న విషయం దీని ద్వారా మరోసారి స్పష్టమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Posted

in

by

Tags: