భోపాల్: భర్త జైలులో ఉన్నాడు. ప్రతి వారం కోర్టు విచారణ జరుగుతుంటుంది. కొన్ని రోజుల క్రితం ఆ విచారణ నిమిత్తమే భార్య కోర్టుకు వెళ్లింది. కానీ ఊహించని విధంగా ఆమె ఆ కోర్టు ప్రాంగణంలోనే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లా కోర్టులో జరిగిన ఈ అసాధారణ ఘటనను చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
ఆ మహిళ పేరు స్వప్న భాస్కర్. ఆమె గర్భం దాల్చి చివరి దశలో ఉన్నప్పటికీ, తన భర్త కోసం కోర్టు విచారణలకు హాజరవ్వడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. మంగళవారం కూడా భర్త కేసు విచారణ కోసం ఆమె కోర్టుకు చేరుకుంది.
కోర్టు హాలులోనే పురుడు
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. ఆమె భర్త ఒక క్రిమినల్ కేసులో జైలులో ఉన్నాడు. కోర్టులో ఉండగానే స్వప్నకు ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే పరిస్థితి చేయి దాటిపోయింది. అలోక్ శ్రీవాస్తవ అనే న్యాయవాది మాట్లాడుతూ.. “వెంటనే మేమంతా అక్కడికి చేరుకున్నాము. కోర్టు హాలులో పెద్ద అలజడి రేగింది. కొందరు నీళ్ల బాటిళ్లు, బట్టలు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ కోర్టు ప్రాంగణంలోనే కొందరు వైద్యులు ఉండటంతో వారిని పిలిపించాము” అని తెలిపారు. దీనివల్ల కాసేపు విచారణ కూడా నిలిచిపోయింది.
అక్కడున్న వారి సహాయంతో స్వప్న కోర్టులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై ఆమె సోదరి స్పందిస్తూ.. “ఇది నిజంగా అద్భుతం. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. కోర్టులో జన్మించాడు కాబట్టి, పెద్దయ్యాక వాడు ఖచ్చితంగా లాయర్ అవ్వాలి. బహుశా దేవుడి కోరిక కూడా అదేనేమో!” అని ఆనందం వ్యక్తం చేశారు.
కోర్టు వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం తాము ఎప్పుడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
