మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో, కొడుకును అదుపులోకి తెస్తామని, కుటుంబంలోని సమస్యలను పరిష్కరిస్తామని నమ్మించి ఓ తల్లి నుంచి సుమారు రూ. 1 కోటి విలువైన నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్న ఘరానా మోసం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కుటుంబంలో ప్రశాంతత నెలకొనాలనే ఆశతో ఆ తల్లి, కొందరు చెప్పిన పూజలు, పరిహారాలు చేయడానికి అంగీకరించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ ముఠా, వివిధ పూజలు మరియు క్రతువుల పేరుతో ఆమె నుంచి డబ్బు, విలువైన వస్తువులను లాగినట్లు ఆరోపణలు వచ్చాయి.
పోలీసుల విచారణలో.. కుటుంబంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి, కొడుకు తల్లి మాట వినేలా చేస్తామని ఆ కేటుగాళ్లు ఆమెను నమ్మించినట్లు తెలిసింది. ఇందుకోసం ఇంట్లో పూజలు, యాగాలు నిర్వహించారని, ప్రతిసారీ నిర్దిష్ట వస్తువులు, నగలు ఇవ్వాలని అడిగేవారని సమాచారం. వారి మాటలు నమ్మిన ఆ తల్లి.. బంగారం, వెండి, నగదును వారికి అప్పగించింది. ఇలా కొద్దికొద్దిగా వారు దోచుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ. 1 కోటి ఉంటుందని అంచనా.
ఈ మోసంలో సుమారు 625 గ్రాముల బంగారం, అరకిలో వెండి, లక్షలాది రూపాయల నగదు చేతులు మారినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబంలో ప్రశాంతత వస్తుందని, కొడుకు తన దారికి వస్తాడని చెప్పడంతో ఆ తల్లి వారిని గుడ్డిగా నమ్మింది. అయితే, ఆశించిన మార్పు రాకపోవడంతో పాటు, ఇచ్చిన బంగారం, డబ్బులు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
ఇదిలా ఉంటే, ఓ నగల దుకాణం యజమాని ఇచ్చిన సమాచారం ఈ కేసులో కీలక మలుపు తిప్పినట్లు తెలుస్తోంది. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఈ మోసంతో సంబంధం ఉందన్న అనుమానంతో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి పూజలు, పరిహారాల పేరుతో సుమారు రూ. 1 కోటి విలువైన ఆస్తులను కాజేశారన్న ఫిర్యాదుపై భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply