కొత్త బట్టలు ఉతకకుండానే వేసుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోకుండా వదిలేయకండి!

నేటి కాలంలో ప్రతి కొత్త ట్రెండ్‌కు అనుగుణంగా బట్టలు కొనడం అందరికీ అలవాటుగా మారింది. అయితే, మీరు షాపుల నుండి లేదా ఆన్‌లైన్ నుండి కొన్న కొత్త బట్టలను ఉతకకుండానే నేరుగా వేసుకుంటున్నారా?

ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త బట్టలు చాలా శుభ్రంగా ఉంటాయని చాలామంది భావిస్తారు, కానీ ఆ నమ్మకం తప్పని నిపుణులు చెబుతున్నారు. కొత్త బట్టలను ఉతకకుండా ధరించడం వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్టరీలలో తయారయ్యే బట్టలు అనేక రకాల ప్రక్రియల ద్వారా వెళతాయి.

బట్టలు షిప్పింగ్ సమయంలో పాడవకుండా ఉండటానికి, షాపుల్లో ముడతలు పడకుండా కొత్తవిగా కనిపించడానికి వాటిపై ఫార్మాల్డిహైడ్ రెసిన్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి చర్మంపై దురద, ఎర్రటి దద్దుర్లు రావడానికి కారణమవుతాయి. ముఖ్యంగా సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి ఇది మరింత తీవ్రంగా ఉంటుంది.

మన కంటికి కనిపించని అనేక క్రిములు కొత్త బట్టలపై ఉండవచ్చు. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు కొత్త బట్టలపై ఉండే అవకాశం చాలా ఎక్కువ. అందుకే వాటిని నేరుగా ధరించడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. అందువల్ల కొత్త బట్టలను ఉతికిన తర్వాతే వాడాలి. ముఖ్యంగా లోదుస్తులను (Undergarments) ఎప్పుడూ ఉతకకుండా వాడకూడదు.

అంతేకాకుండా, కొత్త బట్టల తయారీలో రకరకాల రంగులు (Dyes) ఉపయోగిస్తారు. బట్టలు ఉతకకుండా వేసుకున్నప్పుడు ఆ రంగులు నేరుగా చర్మానికి తగిలి చర్మ వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాపుల్లో చాలామంది ఆ బట్టలను ట్రయల్ వేసి చూస్తుంటారు, అలాగే వాటిపై దుమ్ము కూడా ఉంటుంది. ఇవన్నీ అలర్జీలకు దారితీస్తాయి.


Posted

in

by

Tags: