భువనేశ్వర్: ఒడిశాలో డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేసిన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.
ఏళ్ల తరబడి లంచాల రూపంలో సంపాదించిన కోట్లాది రూపాయలను ఆయన బ్యాంకుల్లో కానీ, ఇతర పెట్టుబడుల్లో కానీ పెట్టలేదు. ఆ డబ్బునంతా తన ఇంట్లోనే దాచుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత విలాసవంతమైన జీవితం గడపాలనే లక్ష్యంతోనే ఆయన ఈ డబ్బును ఇంట్లోనే భద్రపరిచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆయన అత్యంత జాగ్రత్తగా ఉండేవారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
దేబబ్రత మొహంతి చాలా సాదాసీదా జీవితాన్ని గడిపేవారని అధికారులు వెల్లడించారు. తనకు అధికారిక వాహనం ఉన్నప్పటికీ, ఆఫీసు నుండి నేరుగా ఇంటికి ఆ వాహనంలో వెళ్లేవారు కాదు. ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వాహనం దిగిపోయి, అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లడం మొహంతికి అలవాటు. తన పదవి గురించి పొరుగువారికి తెలియకూడదనే ఆయన ఇలా చేసేవారట. లంచం సొమ్మును ఇంట్లోని అల్మారాలు, ట్రాలీ బ్యాగుల్లో దాచి ఉంచినట్లు గుర్తించారు. సర్వీసులో ఉన్నప్పుడు డబ్బు డిపాజిట్ చేస్తే ఆధారాలు చూపాల్సి ఉంటుందని భయపడి, రిటైర్మెంట్ తర్వాత ఆ డబ్బును బయటకు తీయాలని ప్లాన్ చేశారు.
విజిలెన్స్ జరిపిన సోదాల్లో మొహంతి ఫ్లాట్ నుండి రూ. 4.27 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా విజిలెన్స్ చరిత్రలోనే ఇది అతిపెద్ద లంచం కేసుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ కేసు తీవ్రతను బట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. రాష్ట్ర విజిలెన్స్ నుండి అవసరమైన సమాచారాన్ని కోరుతూ శుక్రవారం అధికారికంగా లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు.
బొగ్గు డిపోలకు రవాణా అనుమతులు ఇచ్చేందుకు మొహంతి లంచాలు తీసుకునేవారని తేలింది. ఒక్కో అనుమతికి రూ. 30,000 డిమాండ్ చేసేవారు. లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ తర్వాత జరిపిన సోదాల్లో ఇంట్లో దాచిన భారీ నగదు బయటపడింది.
