మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
32 ఏళ్ల యువకుడికి తన కోడలితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం, ఆగ్రహంతో 48 ఏళ్ల సుందర్ అనే వ్యక్తి ఆ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి, తన్నడంతో అతను మృతి చెందాడు.
ఈ ఘటన తర్వాత పోలీసుల నుండి తప్పించుకోవడానికి, సాక్ష్యాలను మాయం చేయడానికి సుందర్ పలు ప్రయత్నాలు చేశాడు. మృతుడి మృతదేహం, దుస్తులు మరియు ద్విచక్ర వాహనాన్ని వేర్వేరు ప్రదేశాల్లో దాచిపెట్టి, విచారణ సమయంలో పోలీసులను సైతం పదేపదే తప్పుదోవ పట్టించాడు.
అయితే మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, ఆధారాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. లభించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను సరిపోల్చి చూడగా, ఇది సహజ మరణం కాదని, హత్యేనని నిర్ధారణ అయింది.
లోతైన విచారణ అనంతరం తానే హత్య చేసినట్లు సుందర్ అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు బర్వానీ సెంట్రల్ జైలుకు తరలించారు.
కేవలం అనుమానంతో ఒక యువకుడి ప్రాణం పోయిన ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply