“కోపం కాదు ప్రాణ రక్షణ!” గంటలో తమ్ముడి చెంపపై 150 సార్లు కొట్టిన అన్న… 15 యాంటీ వీనమ్ ఇంజెక్షన్లతో దక్కిన ప్రాణం! గుండెల్ని హత్తుకునే వైరల్ స్టోరీ!

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ ప్రాంతంలో పాముకాటుకు గురై చావుబతుకుల మధ్య ఉన్న తమ్ముడిని కాపాడుకునేందుకు.. వైద్యుల సూచన మేరకు అన్న గంట వ్యవధిలో 150 సార్లకు పైగా చెంపదెబ్బలు కొట్టి ప్రాణాలు నిలబెట్టిన భావోద్వేగ సంఘటన వెలుగులోకి వచ్చింది.

హర్దోయ్‌కు చెందిన అరుణ్ (21) అనే యువకుడు పొలంలో గడ్డి మోపును ఎత్తుతుండగా విషపాము కాటువేసింది. ఒంట్లోకి విషం ఎక్కడంతో స్పృహ కోల్పోతున్న తమ్ముడిని గమనించిన అన్న ఆకాష్, వెంటనే బైక్‌పై స్థానిక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు.

అరుణ్‌ను పరీక్షించిన వైద్యులు.. విష ప్రభావం నాడీ వ్యవస్థపై పడిందని, ఈ సమయంలో బాధితుడు నిద్రలోకి జారుకుంటే కోమాలోకి వెళ్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని నిద్రపోకుండా మెలకువగా ఉంచాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

డాక్టర్ల మాటలతో అప్రమత్తమైన అన్న ఆకాష్.. తమ్ముడు కళ్లు మూసుకుని స్పృహ తప్పుతున్న ప్రతిసారీ కన్నీళ్లతో చెంపలపై బలంగా కొడుతూ మేల్కొలిపాడు. అలా దాదాపు గంట వ్యవధిలో 150 సార్లకు పైగా కొట్టి తమ్ముడికి నిద్ర పట్టకుండా చూసుకున్నాడు. వైద్యులు కూడా తక్షణమే 15 యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు ఇచ్చి అత్యవసర చికిత్స అందించారు. అన్న చూపిన అంకితభావం, వైద్యుల సకాల చికిత్సతో అరుణ్ ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రస్తుతం కోలుకుంటున్నాడు.


Posted

in

by

Tags: