ఈ ప్రపంచంలో మానవత్వం ఇంకా పూర్తిగా కనుమరుగవ్వలేదని చాటిచెప్పే అనేక సంఘటనలు రోజూ మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటాయి.
ఆ కోవలోనే, వృద్ధాప్యంలో క్యాన్సర్ బారిన పడి సొంత కుటుంబ సభ్యుల చేత కూడా వదిలివేయబడిన తన మాజీ సహోద్యోగికి, గత 14 ఏళ్లుగా తన సొంత ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తూ ఆదుకుంటున్న 76 ఏళ్ల వృద్ధురాలి హృదయవిదారక కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలువురి కళ్లల్లో ఆనంద భాష్పాలు తెప్పిస్తోంది.
చైనాకు చెందిన ఝాంగ్ జీ (Zhang Ji) అనే ఈ మహిళ చూపిన కరుణ మానవాళికే ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తోంది. చైనాలోని జినాన్ (Jinan) నగరంలో నివసిస్తున్న ఝాంగ్ జీ, గత 2012లో తన పాత ఆఫీస్ సూపర్‌వైజర్ అయిన 82 ఏళ్ల ఝాంగ్ హాంగ్‌క్వాన్ (Zhang Hongquan)ను అనుకోకుండా కలిసింది.
అప్పట్లో భార్య మరణించిన విషాదం, పిల్లల నిరాదరణ కారణంగా అతను తీవ్ర ఒంటరితనంతో, పేగు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో పోరాడుతూ అత్యంత దీన స్థితిలో జీవిస్తున్నాడు. ఇది చూసి చలించిపోయిన ఝాంగ్ జీ, దేని గురించీ ఆలోచించకుండా అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పిస్తానని హామీ ఇచ్చింది.
చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో, ఎలా ఎగతాళి చేస్తారో అనే విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. ఆ వృద్ధుడి వైద్య ఖర్చులు, భోజనం, ఆరోగ్య సంరక్షణ ఇలా బాధ్యతలన్నింటినీ తన భుజాలపై వేసుకుంది. గత 14 ఏళ్లుగా ఎలాంటి అలసట లేకుండా ఈ సేవను కొనసాగిస్తున్న ఝాంగ్ జీ, ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితిలో వచ్చే ప్రతి మార్పును ఎంతో ప్రేమగా గమనిస్తూ వస్తోంది.
కాలికి అయిన గాయాలను శుభ్రం చేయడం దగ్గరి నుంచి అతని పెన్షన్ డబ్బును జాగ్రత్తగా కాపాడటం వరకు ఒక తల్లిలా చూసుకుంది. ప్రారంభంలో ఊరివాళ్లు వీరి గురించి తప్పుగా మాట్లాడినప్పుడల్లా తన స్వచ్ఛమైన మనసుతో, సేవాభావంతో అందరినీ మౌనం వహించేలా చేసింది.
నేడు ఝాంగ్ హాంగ్‌క్వాన్ చిరునవ్వుతో తన దైనందిన పనులను తనే చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడంటే దానికి కారణం ఈ వృద్ధురాలి అంకితభావం మాత్రమే. సొంత రక్తసంబంధీకులే సాయం చేయని ఈ కాలంలో, ఓ మాజీ సహోద్యోగిని దేవుడిలా కాపాడుతున్న ఈ వృద్ధురాలి మానవత్వాన్ని ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎంతో గొప్పగా కీర్తిస్తున్నారు.

Leave a Reply