క్రీడా ప్రపంచాన్ని తలవంచుకునేలా చేసిన ఒక దిగ్భ్రాంతికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. హోటల్ బాత్‌రూమ్‌లో మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు రికార్డ్ చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ నీచమైన పనికి ఒడిగట్టింది ఇద్దరు క్రికెటర్లు కావడం గమనార్హం.
ఈ వార్త క్రికెట్ జగత్తును ఉలిక్కిపడేలా చేసింది. హోటల్ బాత్‌రూమ్‌లో మహిళల వీడియోలను రహస్యంగా చిత్రీకరించినందుకు శ్రీలంక అండర్-19 క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కొలంబోలోని నరహేన్‌పిట ప్రాంతంలో చోటుచేసుకుంది.
కొలంబోలోని ఒక హోటల్‌లో బస చేసిన శ్రీలంక అండర్-19 జట్టులోని ఇద్దరు ఆటగాళ్లపై మహిళల వీడియోలను రహస్యంగా తీసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీవీ9 హిందీ కథనాన్ని ప్రచురించింది.
ఘటన వెలుగులోకి వచ్చింది ఇలా..
శ్రీలంక అండర్-19 జట్టు బస చేసిన హోటల్‌లోనే వైద్యుల సదస్సు (Doctors’ Conference) జరుగుతోంది. ఈ సదస్సుకు చాలా మంది మహిళా వైద్యులు హాజరయ్యారు. తాము స్నానం చేస్తుండగా ఎవరో మొబైల్ ఫోన్‌తో రహస్యంగా వీడియోలు తీస్తున్నారని ఒక మహిళా డాక్టర్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అదే హోటల్‌లో శ్రీలంక అండర్-19 జట్టు కూడా ఉన్నట్లు గుర్తించారు.
పోలీసుల లోతైన విచారణలో, అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లు మహిళా వైద్యురాలు స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరు ఆటగాళ్లను వెంటనే అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో తేలిన నిజాలు
నిందితులైన క్రికెటర్ల ఫోన్లను పరిశీలించగా, అందులో మహిళా వైద్యురాలికి సంబంధించిన వీడియోలు లభ్యమయ్యాయి. ఆ వీడియోలను వారు ఆన్‌లైన్‌లో ఎవరికైనా షేర్ చేశారా? లేదా ఏదైనా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. నరహేన్‌పిట పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరు 5 లక్షల రూపాయల షూరిటీ చెల్లించిన తర్వాత వారికి బెయిల్ మంజూరైంది. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది.
