క్షుద్రపూజలు చేయాలి..! “మాంత్రికురాలిగా మారిన మహిళ”.. మంత్రతంత్రాల కోసం 3 ఏళ్ల చిన్నారిని హత్య చేసి ఇంట్లో దాచిన దారుణం.. తీవ్ర కలకలం!

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో క్షుద్రపూజల కోసం 3 ఏళ్ల బాలికను హత్య చేసినట్లు భావిస్తున్న ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేపింది.

నగర కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అవంతి నగర్ భూట్ మొహల్లా ప్రాంతానికి చెందిన 3 ఏళ్ల చిన్నారి, నవంబర్ 21 మధ్యాహ్నం ఇంటి నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. చిన్నారి ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదని నిర్ధారణ కావడంతో, సమీపంలోని ఇళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బాలిక ఇంటికి సుమారు 40 మీటర్ల దూరంలో ఉన్న రోహ్తాష్ రాజ్‌పుత్ ఇంట్లో అద్దెకు ఉంటున్న సోనాలి అనే మహిళ గదిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

బాలిక మృతదేహం బయటపడటంతో ఆగ్రహానికి గురైన బంధువులు, స్థానికులు ఢిల్లీ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న బులంద్‌షహర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (SSP) దినేష్ కుమార్ సింగ్ స్వయంగా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఆందోళనకారులతో చర్చలు జరిపారు.

ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు, పరిస్థితులను బట్టి చూస్తే క్షుద్రపూజల కోసమే చిన్నారి నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు ఎస్ఎస్పీ తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, అనుమానంతో పొరుగింటి మహిళ సోనాలిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *