ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్తల మధ్య ఒక షాకింగ్ క్లెయిమ్ తెరపైకి వచ్చింది. భారత మాజీ గూఢచారి లక్కీ బిష్త్ మాట్లాడుతూ.. ఖమేనీ మరణ వార్తలు పూర్తిగా నిజం కాకపోవచ్చని, ఆయన ఇప్పటికీ క్షేమంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయం తెలిసి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
యుద్ధాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఒక టీవీ ఇంటర్వ్యూలో లక్కీ బిష్త్ మాట్లాడుతూ.. ఒకవేళ ఖమేనీ మరణించి ఉంటే ఇరాన్ సైన్యం ఇంత వ్యవస్థీకృతంగా ఎలా పోరాడుతోందని ప్రశ్నించారు. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంలో ఇరాన్ చూపిస్తున్న కచ్చితత్వం వెనుక ఒక బలమైన నాయకత్వం లేదా నిఘా నెట్వర్క్ కచ్చితంగా ఉంటుందని ఆయన వాదించారు.
మరణ వార్త వెనుక వ్యూహం (A Calculated Game?): శత్రువులను తప్పుదోవ పట్టించడానికి గూఢచారి సంస్థలు కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని (Fake Information) వ్యాప్తి చేస్తాయని బిష్త్ వివరించారు.
- రష్యా వంటి మిత్రదేశాల నిఘా సంస్థల సాయంతో ఇరాన్ ఒక ‘గేమ్’ ఆడి ఉండవచ్చు.
- ఖమేనీ ఒక నిర్దిష్ట ప్రదేశంలో సమావేశమవుతున్నారనే తప్పుడు సమాచారాన్ని మోసాద్ లేదా సీఐఏకు లీక్ చేసి ఉండవచ్చు.
- అక్కడ దాడి జరిగిన తర్వాత ఖమేనీ మరణించారని నమ్మించి, ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించి ఉండవచ్చు.
- అమెరికా తన ప్రధాన లక్ష్యం ఖమేనీ అని ప్రకటించినందున, ఆయన మరణించారని నమ్మితే యుద్ధం ఆగిపోతుందని ఇరాన్ భావించి ఉండవచ్చు. కానీ యుద్ధం ఇంకా కొనసాగుతుండటం చూస్తుంటే ఖమేనీ వెనుక నుండి ఆదేశాలు ఇస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
యుద్ధ నష్టం: ఫిబ్రవరి 28 నుండి జరుగుతున్న ఈ దాడుల్లో ఇరాన్లో దాదాపు 6,668 పౌర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 5,500 పైగా ఇళ్లు, 65 పాఠశాలలు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు సుమారు 1,483 మంది ప్రాణాలు కోల్పోయారు.
