ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అత్యున్నత నాయకుడికి సంబంధించిన రహస్య సమాచారం హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా భావిస్తున్న మోజ్తబా ఖమేనీ ప్రస్తుతం కోమాలో ఉన్నారని యూకేకు చెందిన ఒక నివేదిక పేర్కొంటోంది.
అయితే అసలు నిజం ఏంటి? ఇది ఏదైనా వ్యూహంలో భాగమా? ఇటీవల అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత, ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ మరణించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆయన కూడా తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నారని వస్తున్న నివేదికలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.
అసలు ఇరాన్‌ను నడిపిస్తోంది ఎవరు? కొన్ని నిఘా నివేదికల ప్రకారం.. మోజ్తబా ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారని, ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరని తెలుస్తోంది. ఒకవేళ అలీ ఖమేనీ మరణించి, మోజ్తబా కూడా కోమాలో ఉంటే, ప్రస్తుతం ఇరాన్ పాలన ఎవరి చేతుల్లో ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ‘ది టైమ్స్’ వంటి పాశ్చాత్య మీడియా సంస్థలు అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాల ఆధారంగా ఈ సమాచారాన్ని ఇస్తున్నాయి. అయితే యుద్ధ సమయంలో “సమాచారం” (Information) కూడా ఒక ఆయుధమే అని మనం గుర్తుంచుకోవాలి.
ఇరాన్ వాదన ఏంటి? ఇరాన్ అధికారిక వర్గాలు మాత్రం దేశ పగ్గాలు మోజ్తబా చేతుల్లోనే ఉన్నాయని చెబుతున్నాయి. ఒకవేళ ఆయనకు ఏదైనా జరిగి ఉంటే ఆ నిజాన్ని ఎక్కువ కాలం దాచడం అసాధ్యం. ప్రభుత్వం ఆయన పేరుతో నిరంతరం సందేశాలను విడుదల చేస్తోంది. ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి: ఒకటి, ఆ సందేశాలు ముందే రికార్డు చేసినవి కావచ్చు. రెండు, భద్రతా కారణాల దృష్ట్యా శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు ఆయన రహస్య ప్రదేశంలో ఉండి ఉండవచ్చు.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే ఆ దేశంలోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని, తాము ఇప్పటికే వారి “శిరస్సును ఖండించాము” (head has been cut off) అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
