ఉత్తరప్రదేశ్ పోలీసుల అరాచకానికి పరాకాష్టగా నిలిచే ఒక అవమానకర ఘటన సహారన్పూర్ జిల్లాలో వెలుగుచూసింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే.. తమ శాఖలో ఉన్నత హోదాలో పనిచేసి రిటైర్ అయిన ఒక మాజీ అధికారిపై అమానుషంగా ప్రవర్తించారు. కేవలం ఫిర్యాదు చేయడానికి వెళ్లినందుకు 72 ఏళ్ల రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ (సీఓ)ని బండబూతులు తిడుతూ, కాలర్ పట్టుకుని బయటకు నెట్టేసిన ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగింది?
రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ సురేష్వీర్ సింగ్ ప్రస్తుతం ఒక సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తున్నారు. మార్చి 2026లో ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మొబైల్ టవర్ నుంచి 24 బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. ఈ విషయమై సెక్యూరిటీ సిబ్బంది మార్చి 23నే ఫిర్యాదు చేసినా, స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకుండా 20 రోజుల పాటు తాత్సారం చేశారు.
దీంతో ఏప్రిల్ 10న సురేష్వీర్ సింగ్ స్వయంగా ఫతేపూర్ స్టేషన్‌కు వెళ్లారు. అనుమతి తీసుకుని లోపలికి వెళ్లి, తన హోదాను వివరిస్తూ రిపోర్ట్ రాయమని కోరారు. అది వినగానే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) వినయ్ కుమార్ శర్మ ఒక్కసారిగా రెచ్చిపోయారు. “రిటైర్డ్ సీఓనని చెప్పుకుంటూ నా ఆఫీసులోకి ఎలా వస్తావు?” అని అరుస్తూ వీరంగం సృష్టించారు.
కాలర్ పట్టుకుని.. నేలకేసి కొట్టి..
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ కుర్చీలో నుంచి లేచి వచ్చి వృద్ధుడైన మాజీ అధికారి కాలర్ పట్టుకున్నారు. ఆయనను బలంగా తోయడంతో సురేష్వీర్ సింగ్ కిందపడిపోయారు. అంతటితో ఆగకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ, గొంతు పట్టుకుని స్టేషన్ గేటు బయటకు నెట్టేశారు. “ఇక్కడి నుంచి పారిపో.. లేదంటే నీకు చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. చోరీ రిపోర్ట్ కూడా రాయను” అంటూ బాహాటంగానే బెదిరింపులకు దిగారు. ఈ దారుణాన్ని అక్కడ ఉన్న సిబ్బంది, సామాన్య ప్రజలు చూస్తూ ఉండిపోయారు.
ఉలిక్కిపడ్డ పోలీస్ శాఖ.. ఇన్స్పెక్టర్పై కేసు నమోదు!
సొంత శాఖకు చెందిన మాజీ ఉన్నతాధికారికే రక్షణ లేకపోవడంతో ఈ ఘటన పోలీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. విషయం సీనియర్ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఎస్ఎస్పీ (SSP) ఆదేశాల మేరకు నిందితుడైన ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ శర్మపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రజల ప్రశ్న: “విభాగంలో పనిచేసిన మాజీ అధికారిపైనే ఇలాంటి ఉన్మాదానికి పాల్పడితే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రిటైర్డ్ పీపీఎస్ అసోసియేషన్ సభ్యులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోమవారం వారు ఏడీజీ (ADG) భాను భాస్కర్‌ను కలిసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల ఇమేజ్ను ఈ ఘటన మరోసారి మసకబార్చింది.
