గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాహుల్ గాంధీకి వెనుక వరుసలో సీటు.. చెలరేగిన వివాదం! కాంగ్రెస్ నేతల ఆగ్రహం.

భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై వివాదం నెలకొంది. రాహుల్ గాంధీని మొదటి వరుసలో ఎందుకు కూర్చోబెట్టలేదని కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఉంటుంది ప్రతిపక్ష నేతకు ఒక ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుందని, బ్రిటీష్ పద్ధతి ప్రకారం వారిని ‘షాడో ప్రధానమంత్రి’ అని కూడా పిలుస్తారని అన్వర్ పేర్కొన్నారు. “నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుండి దేశ సంప్రదాయాలన్నీ కనుమరుగవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతను ప్రభుత్వ కార్యక్రమాల్లో రెండు లేదా మూడో వరుసలో కూర్చోబెట్టడం ముందెన్నడూ జరగలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఖరిపై విమర్శలు విపక్ష నేతను పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో వారికి తగిన గౌరవం ఇవ్వడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. పరేడ్ వీడియోలలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొదటి వరుసలో ఉండగా, రాహుల్ గాంధీ మూడవ వరుసలో కూర్చున్నట్లు కనిపించారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాత్రం ముందు వరుసలో ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌లతో కలిసి కూర్చున్నారు.

రాజ్యాంగమే మన రక్షణ కవచం: రాహుల్ గాంధీ ఈ వివాదం నడుస్తుండగానే, రాహుల్ గాంధీ దేశప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచమని, దానిని కాపాడుకోవడమే స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన ఎక్స్‌ (X) లో పోస్ట్ చేశారు.


Posted

in

by

Tags: