కర్వా చౌత్ పండుగ సందర్భంగా మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం ఉపవాస వ్రతం చేయడం ఆనవాయితీ. ఈ రోజు వేకువజామున ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రి చంద్రుడిని చూసి పూజించే వరకు సుమారు 12 నుంచి 13 గంటల పాటు కనీసం చుక్క నీరు కూడా తాగకుండా మహిళలు కఠిన ఉపవాసం ఉంటారు.
అయితే గర్భిణీ స్త్రీలు ఇలాంటి కఠినమైన ఉపవాసం చేయడం సురక్షితమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై వైద్యులు పలు కీలక సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేశారు.
ఢిల్లీలోని కైలాష్ దీపక్ ఆసుపత్రికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రగ్యా కన్సల్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో ఉపవాసం ఉండటం అనేది ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి, శరీరంలో నీటి శాతం, వాడుతున్న మందులు మరియు ఎంత సమయం పాటు ఆహారం తీసుకోకుండా ఉండగలరు అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు నీళ్లు కూడా తాగకుండా ఎక్కువసేపు ఉపవాసం ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని ఆమె హెచ్చరించారు. ఒకవేళ ఉపవాసం ఉండాలని గట్టిగా అనుకుంటే, వేకువజామున 4 గంటల కంటే ముందే (సర్గీ సమయంలో) పెరుగు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ (గింజలు) వంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఉపవాసానికి ముందు ఒకేసారి మోతాదుకు మించి నీళ్లు తాగకుండా, అప్పుడప్పుడూ నీరు, ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు తాగుతూ శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గకుండా) రాకుండా చూసుకోవాలని సూచించారు.
గర్భిణీలు ఉపవాసం ఉన్న సమయంలో అధిక శారీరక శ్రమను నివారించాలి. ఎక్కువగా పనిచేయడం వల్ల అలసట, నీరసం వస్తుంది. ఎండలో ఎక్కువసేపు ఉండటాన్ని కూడా నివారించి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా అప్పుడప్పుడు లేచి కొద్దిగా నడవాలి. నూనెలో వేయించిన, కడుపుకు బరువుగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఎక్కువ గంటల పాటు నీళ్లు తాగకుండా ఉండటం వల్ల తీవ్రమైన నీరసం వచ్చే అవకాశం ఉన్నందున, ‘నిర్జల వ్రతాన్ని’ (నీరు కూడా తాగని ఉపవాసం) నివారించడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ఉపవాసం విరమించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదట కొద్దిగా నీరు తాగి, ఆ తర్వాత సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాతే సమతుల్య ఆహారం (ఫుల్ మీల్స్) తీసుకోవాలి. ఒకేసారి అతిగా తినడం లేదా ఎక్కువగా నీళ్లు తాగడం చేయకూడదు. మధుమేహం (షుగర్), అధిక రక్తపోటు (బీపీ) లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసానికి దూరంగా ఉండటం మంచిది. గర్భిణీలు ఉపవాసం చేయాలని నిర్ణయించుకునే ముందు తప్పనిసరిగా తమ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి. ఉపవాస సమయంలో ఏదైనా అసౌకర్యం లేదా నీరసం అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే ఉపవాసాన్ని ఆపేసి వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే వెంటనే నీరు, పాలు వంటి ద్రవాహారాలు తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
