అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మూడు నెలల గర్భిణి అయిన అమెరికా పౌరురాలిని ఇమ్మిగ్రేషన్ అధికారులు నేలపై ఈడ్చుకెళ్లి, పెప్పర్ స్ప్రే చల్లి దాడి చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి, వివాదానికి దారితీసింది.
మొడెస్టో నగరంలోని స్టానిస్లాస్ కౌంటీ జైలు వెలుపల, జైలు నుంచి విడుదలవుతున్న వారిని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ 23 ఏళ్ల లిస్బెత్ వర్గాస్ ఆండ్రేడ్ తన భర్త, ఆడపడుచుతో కలిసి నిరసన చేపట్టగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న వీడియోలో, 12 వారాల గర్భిణి అయిన లిస్బెత్ను ముగ్గురు ఇమ్మిగ్రేషన్ అధికారులు బలవంతంగా నేలపైకి తోసేసి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆమె ఓ అధికారిని తాకిన అనంతరం, అధికారులు ఆమెను కిందకు తోసేసి ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి గంటల తరబడి అదుపులో ఉంచుకున్నారని ఆమె తరఫు న్యాయవాది పాట్రిక్ కొలాసిన్స్కీ తెలిపారు. ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో అంబులెన్స్‌లో స్టాక్టన్ ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించిన దృశ్యాలను ఆమె కుటుంబ సభ్యులు విడుదల చేశారు.
అదృష్టవశాత్తూ, వైద్య పరీక్షల అనంతరం తల్లి, కడుపులోని బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు నిర్ధారించడంతో ఆమె ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, సొంత దేశ పౌరురాలైన ఓ గర్భిణిపై ఫెడరల్ అధికారులు ఇంత కఠినంగా బలప్రయోగం ఎందుకు చేశారని ఆమె న్యాయవాది ప్రశ్నిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ఈ ఘటనలో తమ సిబ్బంది ఎవరూ పాల్గొనలేదని, ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఎలాంటి సహాయం చేయలేదని మొడెస్టో పోలీసులు వివరణ ఇచ్చారు. ఉత్తర కాలిఫోర్నియా, బే ఏరియా ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారుల చర్యలు ముమ్మరమైన నేపథ్యంలో, అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

Leave a Reply