ముంబై: ముంబైలోని కాందీవలిలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నిరుద్యోగి, మద్యానికి బానిసైన 42 ఏళ్ల తండ్రి, తన 14 ఏళ్ల మైనర్ కూతురి గొంతుపై బ్లేడ్‌తో దాడి చేశాడు.
ఆ చిన్నారి తన గదిలో ఎంతో ప్రశాంతంగా నిద్రిస్తోంది. చిన్నప్పటి నుండి తనను గారాబంగా పెంచిన తండ్రే, ఇప్పుడు తన ప్రాణాలు తీయడానికి బ్లేడ్‌తో సిద్ధంగా ఉంటాడని ఆ బాలిక అస్సలు ఊహించలేదు. గాఢ నిద్రలో ఉన్న ఆమెపై దాడి జరగడంతో, నొప్పి భరించలేక గట్టిగా అరిచింది. కూతురి అరుపులు విని తల్లి రాజశ్రీ పరుగున రాగా, నిందితుడు ఆమెపై కూడా దాడి చేశాడు. నిందితుడు హనుమంత్ సోనావలే, తన భార్య కడుపులో బ్లేడ్‌తో పొడిచాడు.
మైనర్ బాలిక గొంతుకు 5 కుట్లు రక్తపు మడుగులో ఉన్న తల్లి, కూతురు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనలో బాలిక గొంతుకు 5 కుట్లు పడగా, తల్లికి కూడా చికిత్స అందుతోంది. పోలీసుల కథనం ప్రకారం, నిందితుడికి తన భార్య రాజశ్రీపై అనుమానం ఉంది. ఆమెకు మరొకరితో సంబంధం ఉందని అతను అనుమానించేవాడు. ఘటనకు కొద్దిసేపటి ముందు వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజశ్రీ విడాకులు తీసుకోవాలని, న్యాయ సలహా తీసుకోవాలని సిద్ధమవుతోంది. ఆ కోపంతోనే హనుమంత్ మత్తులో ముందుగా కూతురిపై, ఆ తర్వాత భార్యపై దాడి చేశాడు.
నిందితుడు తరచూ తన భార్యను కొట్టడం, ఆమె ప్రవర్తనపై అనుమానపడటం చేసేవాడు. పోలీసులు హనుమంత్ సోనావలేను అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం మరియు గృహహింస చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కూతురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఒక తండ్రే తన సొంత బిడ్డపై చేసిన ఈ అమానుష దాడి ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
