జకార్తా: ఇండోనేషియాలో గుండెలని పిండేసే విమాన ప్రమాదం సంభవించింది. 11 మందితో వెళ్తున్న ATR 42-500 రకానికి చెందిన ప్రభుత్వ విమానం గాలిలో అకస్మాత్తుగా అదృశ్యమైంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో విమానానికి చివరిసారిగా సంబంధం ఏర్పడింది, ఆ తర్వాత సిగ్నల్స్ నిలిచిపోయాయి.
ఎలా జరిగింది?
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:17 గంటలకు మకాస్సర్ విమానాశ్రయంలో దిగడానికి కొద్దిసేపటి ముందు ఈ విమానం సంప్రదింపులు కోల్పోయింది.
- తక్కువ ఎత్తులో ప్రయాణం: ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, విమానం సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల రాడార్ పరిధి నుండి తప్పించుకుంది. మకాస్సర్ విమానాశ్రయానికి ఉత్తర-తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో చివరి సిగ్నల్ అందింది.
- పర్వత ప్రాంతంలో ప్రమాదం: ఈ విమానం మకాస్సర్ సమీపంలోని బులు సరాంగ్ పర్వత శిఖరాలపై కుప్పకూలినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో పర్వతాల మధ్య విమాన శకలాలు మండుతూ కనిపించాయి. దట్టమైన పొగమంచు, చెల్లాచెదురుగా పడి ఉన్న ప్రయాణికుల సామాను భీభత్సమైన దృశ్యాలను ఆవిష్కరించాయి.
సహాయక చర్యలు:
ఇండోనేషియా అధికారులు ఈ ప్రమాదాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ‘సెర్చ్ అండ్ రెస్క్యూ’ (SAR) బృందాలను యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి తరలించారు.
- ప్రయాణికుల వివరాలు: ఈ విమానం ఇండోనేషియా సముద్ర మరియు మత్స్య శాఖకు చెందినది. ఇందులో మొత్తం 11 మంది ఉండగా, వారిలో 8 మంది క్రూ సభ్యులు, ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం యోగ్యకర్త నుండి మకాస్సర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
