కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా పరిధిలో.. భర్తతో ఏర్పడిన కుటుంబ గొడవల కారణంగా రాత్రి వేళ ఒంటరిగా పుట్టింటికి నడిచి వెళ్తున్న 41 ఏళ్ల మహిళను 10 మంది యువకుల ముఠా అడ్డుకుంది.
ఆమెతో స్నేహపూర్వకంగా మాట్లాడి, మోటార్ సైకిల్‌పై ఇంటి వద్ద దించుతామని నమ్మబలికారు. ఆపై వారు తెచ్చిన కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెకు ఇచ్చారు. అది తాగిన ఆమె స్పృహతప్పడంతో, ఆ మహిళను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ఆ 10 మంది యువకులు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి (గ్యాంగ్ రేప్) పాల్పడ్డారు.
ఈ వికృత చేష్టలను తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేసిన నిందితులు.. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ ఆమెను తీవ్రంగా బెదిరించారు. దీంతో భయపడిపోయిన బాధితురాలు ప్రారంభంలో ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయింది. అయితే, ఆ దుర్మార్గులు ఆ వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేయడంతో, అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై బాధితురాలు బసవపట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన ప్రధాన నిందితులు ఇష్ట్రీ నాగరాజ్, అర్జున, బసవంత సహా ఒక మైనర్ బాలుడితో కూడిన 10 మంది నిందితులను పోలీసులు బంధించారు. ప్రస్తుతం వారందరికీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న ఇటువంటి క్రూరమైన లైంగిక దాడులను అరికట్టడానికి మరియు నేరాల సంఖ్యను తగ్గించడానికి నిందితులకు అత్యంత కఠినమైన శిక్షలు విధించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నేరగాళ్లకు ఇచ్చే శిక్షలు సమాజంలో ఇతరులకు భయం పుట్టించేలా ఉండాలని, అందుకోసం చట్టాల్లో కీలక మార్పులు తీసుకురావాలని వారు పేర్కొంటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం ఎంతగా దూసుకుపోతున్నా, నేటికీ మహిళలు భయం లేకుండా బతికే పరిస్థితి లేకపోవడం అత్యంత విచారకరం.

Leave a Reply